న్యూఢిల్లీ, మే 12: రిజర్వ్‌బ్యాంక్ భయాల్ని నిజంచేస్తూ ఏప్రిల్ నెలలో రిటైల్ ధరలు ఆకాశంలో స్వైరవిహారం చేశాయి. అధిక వంటనూనెలు, ఇంధన ధరల కారణంగా ముగిసిన ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 7.79 శాతం పెరిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ గురువారం వెల్లడించింది. ఇది 7.5 శాతం ఉంటుందన్న విశ్లేషకుల అంచనాల్ని సైతం అధిగమించడం గమనార్హం. అలాగే రిజర్వ్‌బ్యాంక్ సహనస్థాయిగా నిర్దేశించుకున్న 6 శాతంకంటే ఎంతో పైకి ద్రవ్యోల్బణం ఎగసిపోయింది. 2014 మే నెల (8.33 శాతం) తర్వాత గత 8 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడం ఇదే ప్రథమం. 2022 మార్చిలో ఇది 6.95 శాతంకాగా, 2021 ఏప్రిల్‌లో 4.23 శాతం. ఇక రిటైల్స్థాయిలో ధరల స్థాయిని సూచించే వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఈ ఏప్రిల్‌లో కొత్త రికార్డుస్థాయి 170.1 పాయింట్ల వద్దకు చేరింది.
ఆహారోత్పత్తుల పరుగు
ఏప్రిల్ నెలలో ఆహారోత్పత్తుల ధరలు విజృంభించాయి. సంబంధిత ద్రవ్యోల్బణం 8.38 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 7.68 శాతంకాగా, నిరుడు ఏప్రిల్‌లో 1.96 శాతంగా ఉంది. ఈ విభాగంలో వంటనూనెల ధరలు 17.28 శాతం అధికమయ్యాయి. పొద్దుతిరుగుడు నూనెను అధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్ నుంచి యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో మొత్తంగా వంటనూనెల ధరలు మండిపోయాయి. అధిక వేడిమి ఫలితంగా కూరగాయల ధరలు గణనీయంగా 15.41 శాతం పెరిగాయి. మసాలా దినుసుల ధరలు 10.56 శాతం ఎగిసాయి. ఇంధనం, విద్యుత్ క్యాటగిరీలో రిటైల్ ద్రవ్యోల్బణం 10.80 శాతం పెరిగింది.
గ్రామాల్లోనే ధరల జోరు
పట్టణాల్లో కంటే గ్రామా ల్లో ధరలు అధికంగా పెరిగిన ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 8.38 శాతం పెరగ్గా, పట్టణాల్లో ఇది 7.09 శాతంగా ఉంది.
జూన్‌లో మరో ‘వడ్డి’ంపు
ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడంతో ఇటీవల హఠాత్తుగా వడ్డీ రేట్లను 0.4 శాతం మేర పెంచిన రిజర్వ్‌బ్యాంక్ జూన్‌లో జరిగే సమీక్షలో మరోసారి రేట్లను పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు అం టున్నా రు. ఏప్రిల్‌లో అనూహ్యస్థాయికి ద్రవ్యోల్బణం చేరినందున రేట్ల పెంపు తప్పదని సంబంధిత వర్గాలు హెచ్చరించాయి. అలాగే ఆర్బీఐ కమిటీ పూర్తి సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాల్ని కూడా పెంచే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే 2022 మే నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం పరుగు 6.5 శాతానికి నెమ్మదించవచ్చని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ అంచనా వేశారు. నిరుడు మే నెలలో బేస్ అధికంకావడమే దీనికి కారణమని తెలిపారు.