పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
భారతీయ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంపై స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన బహిరంగ విమర్శలపట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) గట్టిగానే స్పందించింది. గతకొద్ది రోజులుగా ఇక్కడి చట్టాలు, విధానాలపై మస్క్ నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో రిలయన్స్ శుక్రవారం మౌనం వీడింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : భారతీయ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంపై స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన బహిరంగ విమర్శలపట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) గట్టిగానే స్పందించింది. గతకొద్ది రోజులుగా ఇక్కడి చట్టాలు, విధానాలపై మస్క్ నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో రిలయన్స్ శుక్రవారం మౌనం వీడింది. మార్కెట్లో పోటీకి భయపడే ప్రసక్తే లేదని, వినియోగదారులకు ఎవరు అత్యుత్తమ సేవలను అందిస్తారో చూసుకుందామంటూ కౌంటర్ ఇచ్చింది. స్టార్‌లింక్‌తో పోటీని స్వాగతిస్తున్నామని, అయితే ఇక్కడి చట్టాలు, విధానాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని, వాటిని మస్క్ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని పేర్కొన్నది. తమను భారత్‌కు రాకుండా రిలయన్స్ అడ్డుకుంటున్నదని మస్క్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని స్వలాభానికి ప్రయత్నిస్తున్నదని, కొన్ని వ్యాపార గ్రూపులు భారతీయ వినియోగదారులపై గుత్తాధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయని విమర్శలు గుప్పించిన సంగతీ విదితమే.
మార్కెట్లో పోటీ పెరిగితే శాట్‌కామ్ వినియోగదారులకే లాభమని, అయితే పోటీ లేకుండా అడ్డుకుంటున్నారని మస్క్ అంటున్నారు. ఈ క్రమంలోనే ‘మేము పోటీకి ఎప్పుడూ భయపడబోం. నిజానికి కస్టమర్‌కు ఎవరు అత్యుత్తమ సర్వీసును అందిస్తారు అన్నదానికి అసలైన పరీక్ష మార్కెట్ కాంపిటీషనే’ అని ఓ ప్రకటనలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. 2016లో భారతీయ టెలికాం మార్కెట్లోకి జియో ప్రవేశించిందని, అప్పుడు ఎంతో పోటీ ఉన్నదని, అయినప్పటికీ అత్యుత్తమంగా, ఆకర్షణీయ రీతిలో చౌకగా సేవలను అందించి పదేండ్లలో 53 కోట్లకుపైగా కస్టమర్లను పొందగలిగామని గుర్తుచేసింది. దేశంలోని ప్రతి సంస్థలాగే రిలయన్స్ కూడా కష్టపడి ఎదిగిందని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పెట్టుబడులు-సాంకేతికతలు దేశీయ సంస్థ నుంచిగానీ, అంతర్జాతీయ సంస్థ నుంచైనా వస్తే అది స్వాగతించదగినదేనని వెల్లడించింది.
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు జియో, ఎయిర్‌టెల్‌తోపాటు స్టార్‌లింక్ కూడా ప్రయత్నిస్తున్నది. అయితే రెగ్యులేటరీ అనుమతుల్లో జరుగుతున్న జాప్యంపై మస్క్ చేసిన విమర్శలు, ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించినది తెలిసిందే. ఇటీవల భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కూడా మస్క్ తీరుపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ శాటిలైట్ కమ్యూనికేషన్స్ వెంచర్ యూటెల్‌శాట్ వన్‌వెబ్.. భారత్‌లో సర్వీసులను ప్రారంభించడానికున్న క్యూలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంటే ముందున్నదని వ్యాఖ్యానించారు. కాగా, వాణిజ్య సేవలను ప్రారంభించడానికి ముందే భద్రతాపరమైన షరతులు, స్పెక్ట్రమ్ కేటాయింపుల నిబంధనలు సహా అన్ని రెగ్యులేటరీ పరిమితుల్ని శాటిలైట్ ఆపరేటర్లంతా అనుసరించాల్సిందేనని కేంద్రం చెప్తున్నది.
నిజానికి మస్క్ స్టార్‌లింక్, రిలయన్స్ జియో శాట్‌కామ్, ఎయిర్టెల్ యూటెల్‌శాట్ వన్‌వెబ్‌లకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్సులు వచ్చినట్టు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అయితే వాణిజ్య సేవల ప్రారంభానికి లైసెన్సు ఒక్కటే సరిపోదని స్పష్టం చేశారు. స్పెక్ట్రమ్ అసైన్మెంట్, సెక్యూరిటీ కండీషన్స్ ఫుల్ఫిల్మెంట్ కూడా కీలకమన్నారు. కాగా, చార్జీలకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తే, శాట్‌కామ్ ఆపరేటర్లు అవసరమైన వాటిని పూర్తిచేస్తే.. స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీవోటీ)లు శాటిలైట్ స్పెక్ట్రమ్ ధరలపై ఓ నిర్ణయానికి వచ్చినట్టేనని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా, అమెజాన్ ప్రాజెక్ట్ కుయ్పర్ సైతం భారత్‌లో శాట్‌కామ్ సేవలపట్ల ఆసక్తి కనబరుస్తున్నది. అయితే నిర్దేశిత మార్గంలో రావాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

