Gold ETF | బంగారం.. భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం.. ప్రతి పండుగకు.. పెండ్లిండ్లకూ.. శుభకార్యానికి పిసరంత బంగారం కొనాలని మహిళలు ఆశ పడతారు. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్‌గా కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేస్తూ వస్తోంది. కేంద్రంతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు – బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) లు ఇన్వెస్టర్ల నుంచి సొంతంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (గోల్డ్ ఈటీఎఫ్)ల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్లు.. గోల్డ్ ఈటీఎఫ్ బాండ్లలో పెట్టిన పెట్టుబడులకు సమానంగా జారీ చేసే బాండ్లు బంగారం ధరతో సమానమే. అవసరమైనప్పుడు రుణం తీసుకోవచ్చు.. అత్యవసరమైతే విత్ డ్రా చేసుకోవచ్చు.
గత నెలలో గోల్డ్ ఈటీఎఫ్ (Gold Exchange Traded Fund)ల్లో పెట్టుబడులు రూ.1,028 కోట్లకు చేరాయి. గత 16 నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇదే గరిష్టం. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యతో తలెత్తిన భౌగోళిక అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 2022 ఏప్రిల్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్లు రూ.1,100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఒక నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో గరిష్టంగా పెట్టుబడులు మదుపు చేయడం ఇదే ఫస్ట్ టైం.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఏడాది కాలంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచుతుండటంతో డాలర్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెంచుతున్నారు.
మ్యూచువల్ ఫండ్ కంపెనీల ఆర్గనైజేషన్-అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులోనే 73.40 శాతం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టు నాటికి మొత్తం రూ.1,400 కోట్ల పెట్టుబడులు రికార్డయ్యాయి. జూలైలో ఇన్వెస్టర్లు రూ.456 కోట్ల గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేవలం రూ.298 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.
ఇక అంతకుముందు మూడు త్రైమాసికాల్లో ఇన్వెస్టర్లు తమ గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ వచ్చారు. జనవరి-మార్చి 2023 త్రైమాసికంలో రూ.1,243 కోట్లు, అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో రూ.320 కోట్లు, జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.165 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు విత్ డ్రా చేసుకున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈల్లో ట్రేడ్ అవుతున్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే గోల్డ్ ఈటీఎఫ్ బాండ్లతో సమానంగా మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి మీ డీమ్యాట్ ఖాతాకు మనీ ట్రాన్స్ ఫర్ అవుతాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా గోల్డ్ ఈటీఎఫ్ ధరలు ఖరారవుతాయి. ఇన్వెస్టర్లుగా మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో నిష్క్రమించినప్పుడు బంగారం విలువను బట్టి మీ ఖాతాలో మనీ క్రెడిట్ అవుతుంది.