Demat A/C Double in 3 Yrs | మనం కుటుంబ ఖర్చులకు మించి ఆదాయం సంపాదిస్తే బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్ చేయడం గానీ.. బంగారం కొనుగోలు చేస్తాం.. భారీగా డబ్బు సమకూరాక ఆస్తుల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తాం.. కానీ గమ్మత్తేమిటంటే గత మూడేండ్లలో సేవింగ్స్ ఖాతాల కంటే డీమ్యాట్ ఖాతాలు రెట్టింపుకు పైగా ప్రారంభం అయ్యాయి. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వారు మాత్రమే డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో పెరిగిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య వివిధ బ్యాంకుల్లో 1.9 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. అంటే సగటున 26.7 లక్షల ఖాతాలన్నమాట. కానీ చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. చివరకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతాలు పడిపోయాయి.
గత ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోని తొలి ఏడు నెలల్లోనే 30 శాతానికి పైగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభం అయ్యాయి. 2018-19లో 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే.. ఈ ఏడాది గత నెలాఖరు నాటికి 7.4 కోట్లకు చేరుకున్నాయి. అంటే డీమ్యాట్ ఖాతాలు రెండు రెట్లు పెరిగాయి.
ఇదే టైంలో గత మూడేండ్లుగా స్మాల్ సేవింగ్స్ ఖాతాల్లో వృద్ధిరేటు పడిపోయింది. బాలికల కోసం నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి మినహా పొదుపు ఖాతాలన్నీ ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య 2.3 కోట్ల పొదుపు ఖాతాలు జత కలిశాయి. అంటే సగటున నెలకు 29 లక్షల ఖాతాలు చేరాయి. 2018-19లో 4.66 కోట్ల స్మాల్ సేవింగ్స్ ఖాతాలు ఉంటే 2019-20లో 4.12 కోట్లకు పడిపోయాయి.
అంతే కాదు నూతన ఖాతాలు ప్రారంభించే సీనియర్ సిటిజన్లు వెనకడుగు వేస్తున్నారు. గతంతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీం ఖాతాలు తగ్గుముఖం పట్టాయి. 2018-19లో 12.6 లక్షల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఖాతాలు రిజిస్టర్ అయితే, 2019-20లో 12.2 లక్షలకు.. 2020-21లో 11.4 లక్షలకు పడిపోయాయి. సాధారణంగా పెరిగే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలు కూడా తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.33 కోట్ల స్మాల్ సేవింగ్స్ ఖాతాలు ప్రారంభం అయ్యాయి.