Reits Vs Invits | రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)ను నూతన ఆర్థిక సాధనాలుగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ వంటివే. మదుపరుల నుంచి నిధులను సేకరించి ఆఫీస్ స్పేస్, మాల్స్, హోటల్స్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, గిడ్డంగుల వంటి ఆదాయ కారక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో పెట్టుబడులుగా పెడుతాయి. ఈ పెట్టుబడులపై అద్దె రూపంలో వచ్చిన ఆదాయాన్ని.. ఇన్వెస్టర్లకు డివిడెండ్ల రూపేణా పంపిణీ చేస్తాయి. రీట్స్ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో నమోదవుతాయి. డీమ్యాట్ ఖాతా ద్వారా షేర్లలో ఎలాగైతే మనం పెట్టుబడులు పెడుతామో అలాగే వీటిల్లోనూ పెట్టుబడి పెట్టవచ్చు. రీట్‌లో కనీస పెట్టుబడి ఒక్కో లాట్‌కు రూ.10,000-15,000 మధ్య ఉంటుంది. మీ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం వీటిని ఎంచుకోవచ్చు.
ఈక్విటీ రీట్స్: అద్దెల ద్వారా ఆదాయాన్ని పొందుతాయి.
మార్ట్గేజ్ రీట్స్: తనఖా ఆస్తుల్లో పెట్టుబడుల ద్వారా వడ్డీని ఆర్జిస్తాయి.
హైబ్రీడ్ రీట్స్: ఈక్విటీ, మార్ట్గేజ్ రీట్స్ల మాదిరి పెట్టుబడులపై అద్దె, వడ్డీలను అందుకుంటాయి.
ప్రైవేట్ రీట్: వీటిలో పరిమిత సంఖ్యలో మదుపరులుంటారు. సెబీ వద్ద నమోదు కావు. స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్లవు.
పబ్లిక్ ట్రేడెడ్ రీట్: స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతాయి. సెబీ దగ్గర రిజిస్టర్ అవుతాయి.
నాన్ పబ్లిక్ ట్రేడెడ్ రీట్: సెబీ వద్ద నమోదైనా.. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావు. కాబట్టి ఒడిదొడుకులకు ఆస్కారం ఉండదు.
రీట్స్ తరహాలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) ఉంటాయి. అయితే నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రీట్స్ పెట్టుబడులు పెడితే.. ఇన్విట్స్ మాత్రం మౌలిక రంగంలో పెట్టుబడులను పెడుతాయి. రహదారులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులుంటాయి. డివిడెండ్ల రూపంలో ఇన్వెస్టర్లకు రెగ్యులర్ ఇన్‌కమ్‌ను అందిస్తాయి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీలు ఇన్విట్స్‌ను ఏర్పాటు చేస్తాయి. తద్వారా వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులను సమీకరిస్తాయి. ట్రస్టీ, స్పాన్సర్, ఇన్వెస్ట్మెంట్-ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు. ఇన్విట్స్‌లో కనీస పెట్టుబడి దాదాపు రూ.10,000-15,000. డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్విట్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు.
పూర్తయిన ప్రాజెక్టులు: హైవేలు, పవర్ ప్లాంట్ల వంటి పూర్తయిన మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవి.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవి. వీటి నుంచి ఆదాయం పొందడానికి కొంత సమయం పడుతుంది.
ప్రైవేట్ ప్రాజెక్టులు: స్టాక్ ఎక్సేంజీల్లో ఈ ఇన్విట్స్ నమోదు కావు. అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని కొనలేరు. దీంతో వీటిలో మదుపరులు పరిమిత సంఖ్యలోనే ఉంటారు.
ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు: స్టాక్ ఎక్సేంజీల్లో నమోదవుతాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సులభంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
ప్రాజెక్టు రకాన్నిబట్టి ఇన్విట్స్‌ను ఇలా కూడా విభజించుకోవచ్చు. ఎనర్జీ, టాన్స్‌పోర్ట్-లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, సామాజిక,-వాణిజ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్-శానిటేషన్.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ రెండూ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి మదుపరులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రవేశించడానికి దోహదం చేస్తాయి. రియల్టీ పెట్టుబడులను సులభతరం చేస్తాయి. అంతేగాక పెట్టుబ డులు పెట్టిన మదుపరులకు డివిడెండ్ల రూపంలో రెగ్యులర్ ఆదాయాన్ని అందిస్తాయి. అ యినప్పటికీ లాభాలు, నష్టాలున్నాయి.
రీట్స్‌లో భారీగా నగదు నిల్వలుంటాయి. స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. కానీ స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులకు తీవ్రంగా ప్రభావితమై ఉంటాయి. ఇక ఇన్విట్స్‌లో తక్కువ నగదు నిల్వలుంటాయి. రీట్స్ తరహాలో స్థిరమైన ఆదాయం ఇన్వెస్టర్లకు రాదు. కానీ రాజకీయ పరిణామాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి అటు రీట్స్లోగానీ, ఇటు ఇన్విట్స్లోగానీ పెట్టుబడులు పెట్టే ముందు స్వతంత్ర రేటింగ్ ఏజెన్సీలు విడుదల చేసే రేటింగ్స్‌ను పరిశీలించండి. ఆ తర్వాత మీ లక్ష్యాలు, రాబడికి పట్టే సమయంపట్ల మీకుండే ఓపిక ఆధారంగా నిర్ణయం తీసుకోండి.