Retail Inflation | గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగి వచ్చింది. జనవరి ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.10 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. జనవరిలో ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం. కానీ ఆర్బీఐ నాలుగు శాతం లోపు ఉండాలని ఆర్బీఐ భావిస్తున్నది.
జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ఆహార ద్రవ్యోల్బణం 8.30 శాతం నుంచి 8.66 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం యధాతథంగా 5.34 శాతంగా ఉంటే, పట్టణ ద్రవ్యోల్బణం 4.92 నుంచి 4.78 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు 27.03 శాతం నుంచి 30.25 శాతానికి పెరిగాయి. మరోవైపు ఫ్యుయల్ ద్రవ్యోల్బణం మైనస్ 0.77 శాతానికి, విద్యుత్ ద్రవ్యోల్బణం మైనస్ 0.60 శాతానికి పడిపోయింది.
మరోవైపు ఇండియా ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ (ఐఐపీ) సూచీ 3.8 శాతానికి పెరిగింది. జనవరితో పోలిస్తే మాన్యుఫాక్చరింగ్ రంగ ఉత్పత్తి 3.2 శాతం పెరిగితే, గతేడాది ఫిబ్రవరిలో 4.5 శాతం తగ్గింది.