న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో భారత్ 19.81 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐలను ఆకర్శించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన ఎఫ్‌డీఐలతో పోలిస్తే ఆరు శాతం పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఎఫ్‌డీఐల్లో 76 శాతం తగ్గుముఖం పట్టడం విశేషమని డీపీఐఐటీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 18.62 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి.
మే నెలలో ఎఫ్‌డీఐలు 29 శాతం తగ్గి 2.8 బిలియన్ డాలర్లకు పరిమితమవగా, జూన్‌లో కూడా 29 శాతం తగ్గి 4.91 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కానీ, ఏప్రిల్ నెలలో మాత్రం రెండింతలు పెరిగి 6.6 బిలియన్ డాలర్ల నుంచి 12.1 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల్లో అత్యధికంగా జపాన్ నుంచి 5.71 బిలియన్ డాలర్లు రాగా, ఆ తర్వాత సింగపూర్ నుంచి 5.22 బిలియన్ డాలర్లు, మారిషస్ నుంచి 2.31 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ నుంచి 1.38 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 1.34 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి 868 మిలియన్ డాలర్లు వచ్చాయి.