Home Loan | సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కరోనా తర్వాత సొంతింటి కోసం దాదాపు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. సొంతిల్లు అంటే భారీ పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం.. ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు అందరికీ అంత పెద్ద మొత్తంలో డబ్బు అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటప్పుడు లేనప్పుడు లోన్ కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇంటి రుణం అంటే భారీ మొత్తంలో పెట్టుబడి కనుక.. దీని కోసం బ్యాంకు అధికారులు చాలా ప్రాసెస్ చేస్తారు. ఈ లోన్ ప్రాసెస్ సజావుగా సాగాలంటే అనునిత్యం.. ప్రతి దశ గురించి ఒక అవగాహన ఉండాలి. లోన్ ప్రాసెస్‌లో ముఖ్యమైంది లోన్ శాంక్షన్ లెటర్ మాత్రమే.. గడువులోపు ఆ శాంక్షన్ లెటర్‌పై సంతకం చేసిస్తేనే.. తదుపరి రుణ మంజూరు ప్రక్రియను బ్యాంకులు చేపడతాయి.
లోన్ శాంక్షన్ లెటర్ కేవలం మీరు ఇంటి రుణం తీసుకునేందుకు గల అర్హతను మాత్రమే తెలుపుతుంది. శాంక్షన్ లెటర్ రాగానే లోన్ వచ్చినట్లు భావించొచ్చు. మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకు ముందుగా మీరు ఫైల్ చేసిన అప్లికేషన్, దాంతోపాటు అనుబంధ పత్రాలు పరిశీలించాక.. మీకు గల రుణ యోగ్యతను చెక్ చేస్తారు బ్యాంకు అధికారులు. మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ చరిత్ర ప్రతి అంశం మీద క్షుణ్ణంగా విచారిస్తారు. మీరు కొనే ఇంటి విలువ, భవిష్యత్‌లో విలువ చూసి.. పూర్తిగా సంతృప్తి చెందితేనే హోంలోన్ శాంక్షన్ లెటర్ ఇవ్వాలని బ్యాంకు అధికారులు నిర్ణయానికి వస్తారు.
లోన్ శాంక్షన్ చేస్తామంటూ మీకు బ్యాంకు అధికారులు ఇచ్చే లేఖలో మీకిచ్చే లోన్ మొత్తం, దానిపై వడ్డించే వడ్డీ, (ఫ్లోటింగ్ / ఫిక్స్డ్ రేట్), చెల్లింపు కాలం, ఈఎంఐ పేమెంట్, ఆదాయం పన్ను మినహాయింపు ప్రయోజనాలు తదితర వివరాలన్నీ ఉంటాయి. రుణ గ్రహీతలు ఈ అంశాలన్నీ నిశితంగా, క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. లోన్ శాంక్షన్ లేఖ నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాన్ని అంచనా వేస్తుంది. కనుక రుణ గ్రహీతలు తమ ఇన్‌కం, ఖర్చులను బట్టి బడ్జెట్ వేసుకోవాలి. నెలవారీగా ఈఎంఐ సక్రమంగా చెల్లించగలరా? లేదా? అంచనా వేసుకున్నాక.. లోన్ తీసుకోవాలా.. వద్దా.. అన్న సంగతిపై నిర్ణయానికి రావచ్చు.
పలువురు వ్యక్తులు కేవలం లోన్ శాంక్షన్ లేఖే తుది రుణ అగ్రిమెంట్ అనుకుంటారు. కానీ లోన్ శాంక్షన్ లెటర్ మీ అర్హతను మాత్రమే తెలుపుతుంది. శాంక్షన్ లెటర్ అందుకున్నా.. అది పూర్తిగా ఆమోదయోగ్యం అని భావిస్తే రుణ గ్రహీత.. దానిపై సంతకం చేసి, బ్యాంకు అధికారులకు సమర్పించాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేయడానికి తుది ప్రక్రయి చేపడతారు. చాలా బ్యాంకులు డిజిటల్ గానే లోన్ శాంక్షన్ లెటర్ జారీ చేస్తున్నాయి. ఆ శాంక్షన్ లెటర్ మీద నిర్ణీత గడువు లోపు సంతకం చేసి ఇస్తేనే తుది రుణం విడుదల ప్రక్రియను అధికారులు మొదలు పెడతారు.