న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రస్తుత ఏడాది ఆశ్చర్యకరంగా అంచనాల్ని మించిన వృద్ధి సాధించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం వృద్ధి రేటు క్షీణిస్తుందని అంతర్జాతీయ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేసింది. 2024లో వృద్ధి రేటు 2.7 శాతానికి మందగిస్తుందని పేర్కొంది.
2020 కొవిడ్ పాండమిక్ తర్వాత అత్యంత కనిష్ఠస్థాయికి వృద్ధి ఇదే అవుతుందని తెలిపింది. ప్రస్తుత సంవత్సరం 2.9 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. అధిక వడ్డీ రేట్లు, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఇంధన ధరలు పెరగడం వృద్ధిని ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త రిస్క్‌లు ఏర్పడుతున్నాయని ఓఈసీడీ హెచ్చరించింది.