ముంబై, మార్చి 18: విదేశీ మారకం నిల్వలు మళ్లీ పడిపోయాయి. ఈ నెల 10తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.39 బిలియన్ డాలర్లు తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయి 560.003 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతకుముందు వారంలో రిజర్వులు 1.46 బిలియన్ డాలర్లు పెరిగి 562.40 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. క్రితం ఏడాది ఇదే వారంలో నమోదైన రిజర్వులతో పోలిస్తే 47.31 బిలియన్ డాలర్లు తగ్గాయి. గతేడాది డిసెంబర్ తొలివారంలో నమోదైన రిజర్వుల కంటే తగ్గాయని పేర్కొంది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.2 బిలియన్ డాలర్లు తరిగిపోయి 494.86 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం, మరోవైపు ఇతర కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతో విదేశీ ఎక్సేంజ్ రిజర్వులపై ప్రభావం చూపుతున్నదని తెలిపింది. రూపాయి పతనానికి కట్టడి చేయడానికి ఆర్బీఐ గతవారంలోనూ డాలర్లను విక్రయించింది.
పసిడి రిజర్వులు కూడా..
పసిడి రిజర్వులు కూడా తగ్గుముఖం పట్టాయి. గతవారాంతానికిగాను 110 మిలియన్ డాలర్లు తగ్గి 41.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పసిడితోపాటు ఎస్డీఆర్ హోల్డింగ్స్ కూడా 53 మిలియన్ డాలర్లు తరిగిపోయి 18.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని, గతవారంలో 10 శాతం వరకు పడిపోయినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. అక్టోబర్ 2021లో రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ నిల్వలు ప్రస్తుతం ఇంచుమించుగా 80 బిలియన్ డాలర్లకు వరకు కరిగిపోయాయి.