న్యూఢిల్లీ, జూన్ 23 : దేశీయంగా వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఈ నెలలో కంపెనీలకు కొత్త ఆర్డర్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని.. వస్తూత్పత్తులు, సేవలకు గిరాకీ తగ్గిందని తాజా హెచ్ఎస్బీసీ ఫ్లాష్ పీఎంఐ సర్వేలో తేలింది. జూన్లో హెచ్ఎస్బీసీ ఫ్లాష్ ఇండియా కంపోజిట్ పీఎంఐ ఉత్పాదక సూచీ 57.4 శాతానికి పడిపోయింది. అంతకుముందు నెల మేలో ఇది 59.3 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో మార్చి నుంచి వ్యాపార విస్తరణపరంగా ఇదే కనిష్ఠ స్థాయి అయ్యింది. తయారీ, సేవల రంగాల్లో డిమాండ్ పేలవంగా ఉన్నది. అధిక ఉత్పాదక వ్యయం.. అమ్మకాలను ప్రభావితం చేస్తున్నది.
కొత్త కస్టమర్లను ఆకర్షించి, ఫ్రెష్ ఆర్డర్లను పొందడం కష్టంగా ఉన్నదని పలువురు వ్యాపారులు చెప్తుండటం.. దేశంలో వ్యాపార రంగం తీరుతెన్నులకు అద్దం పడుతున్నది. పెరుగుతున్న ఇంధన ధరలు, వేధిస్తున్న గ్యాస్ కొరత, అధికమవుతున్న పోటీ కూడా సవాళ్లను విసురుతున్నాయి. ఇక డిమాండ్ లేకపోవడంతో కంపెనీల విస్తరణ సైతం పడకేస్తున్నది. అలాగే ఎగుమతుల్లో వృద్ధి సైతం దాదాపు రెండేండ్ల కనిష్ఠాన్ని తాకింది.
కొత్త వ్యాపారాల్లో మందగమనం.. ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నది. ఆయా కంపెనీలు జూన్లో చేసుకున్న నియామకాలు.. 6 నెలల కనిష్ఠ స్థాయిలో ఉండటం గమనార్హం. తయారీ, సేవల రంగ సంస్థల్లో నీరసం కనిపిస్తున్నది. ప్రస్తుతమున్న ఉద్యోగులే ఇప్పుడున్న పనికి సరిపోతారని, కనుక మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకోలేమని యాజమాన్యాలు చెప్తున్నాయి. అంతేగాక ఇంధనం, ఆహారం, గ్యాస్, లోహాలు, యుటిలిటీస్కు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తున్నదని, అందుకే వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అంటున్నాయి.