న్యూఢిల్లీ, జనవరి 31: కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు అంచనాల్ని మించిపోయింది. ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే ద్రవ్యలోటు 2022 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లోనే రూ.9.93 లక్షల కోట్లకు చేరిందని, ఇది వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 59.8 శాతమని ఆర్థిక సర్వే వెల్లడించింది. గత ఏడాది ఇదేకాలంలో బడ్జెట్ లక్ష్యంలో 50.4 శాతానికే ద్రవ్యలోటు పెరిగింది. వివరాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం ప్రభుత్వ వసూళ్లు రూ.18.25 లక్షల కోట్లుకాగా, ఇదే సమయంలో వ్యయం రూ.28.18 కోట్లకు చేరింది.
మొత్తం వసూళ్లలో రెవిన్యూ వసూళ్లు రూ.17.70 లక్షల కోట్లు.ఇందులో పన్ను ల ఆదాయం రూ.15.56 లక్షల కోట్లు. పన్నుయేతర ఆదాయం రూ.2.14 లక్షల కోట్లు.
పన్ను, పన్నుయేతర ఆదాయం గత ఏడాది బడ్జెట్ లక్ష్యాలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం వెనుకపడ్డాయి. 2021-22 ఏప్రిల్-డిసెంబర్ మధ్యలో బడ్జెట్ లక్ష్యంలో పన్ను ఆదాయం 95.4 శాతం, పన్నుయేతర ఆదాయం 106.7 శాతం మేర సమకూరగా, ఈ ఏడాది 80.4 శాతం, 79.5 శాతమే వచ్చింది.
రెవిన్యూ లోటు రూ.5.58 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ లక్ష్యంలో ఇది 56.3 శాతం.
వ్యయాలకు సంబంధించి డిసెంబర్ వరకూ రూ.3.51 లక్షల కోట్లు ఆహార, ఎరువులు, పెట్రోలియం తదితరాలకు సబ్సిడీలుగా ఖర్చయ్యింది. ఇది వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 110 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ వ్యయం 81 శాతం.
అధిక క్యాడ్..రూపాయి క్షీణత
అంతర్జాతీయ కమోడిటీ ధరలు అధికస్థాయిలో ఉన్నంతకాలం కరెంటు ఖాతా లోటు (క్యాడ్) విస్త్రతమయ్యే ప్రమాదం ఉందని, దీంతో రూపాయి సైతం క్షీణిస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో క్యాడ్‌ను (దేశంలోకి వచ్చే, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) నిశితంగా గమనించాలని సూచించింది. రిజర్వ్‌బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం 2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో 2.2 శాతంగా ఉన్న క్యాడ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 4.4 శాతానికి పెరిగిపోయిందని సర్వే తెలిపింది. ఎగుమతుల వృద్ధి పరిమితంగా ఉండటం, దిగుమతులు భారీగా పెరగడం క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణమన్నది.
ఎగుమతుల వృద్ధి మందగించడం, దిగుమతులు పెరగడంతో వాణిజ్యలోటు పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవల తెలిపారు. దేశంలోకి రెమిటెన్సులు పెరిగినా, వాణిజ్యలోటు అధికంకావడం కరెంటు ఖాతా లోటు పెరుగుదలకు దారితీసింది. కరెంటు ఖాతా లోటును పూడ్చడానికి దేశం వద్ద ప్రస్తుతం తగిన విదేశీ మారక నిల్వలు ఉన్నాయని సర్వే పేర్కొంది. 2022 డిసెంబర్ చివరినాటికి 563 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్నాయి. ఇవి 9.3 నెలల దిగుమతులకు సరిపోతాయి.