న్యూయార్క్, సెప్టెంబర్ 7: పలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యింది. అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుస్థాయిని చేరడంతో పలు కమోడిటీలు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 89 డాలర్ల లోపునకు పడిపోయింది.
బుధవారం రాత్రి ఇది 4.5 శాతం మేర క్షీణించి 88.7 డాలర్ల స్థాయి వద్దకు చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇంత కనిష్ఠస్థాయికి దిగిరావడం ఇదే ప్రధమం. రష్యా-ఉక్రెయిన్ పోరుతో క్రూడ్ 128 డాలర్ల స్థాయికి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డాలర్ పెరిగినందున ఆయా దేశాలు చమురు ధర ఎక్కువగా చెల్లించాల్సి ఉన్నందున క్రూడ్ ధర తగ్గినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.