జెనీవా, మార్చి 20: తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన స్విట్జర్లాండ్ బ్యాంక్ క్రెడిట్ స్విస్‌ను కొనుగోలు చేసేందుకు రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిపిన చర్చల అనంతరం అదే దేశానికి చెందిన యూబీఎస్ అంగీకరించింది. సోమవారం ప్రపంచ మార్కెట్లు ప్రారంభమయ్యేసరికల్లా ఎట్టిపరిస్థితుల్లో క్రెడిట్ స్వీస్‌ను గట్టెక్కించకపోతే బ్యాంకింగ్ సంక్షోభం వివిధ దేశాలకు వ్యాపిస్తుందన్న భయాలతో సిట్జర్లాండ్ రెగ్యులేటర్లు పలు రాయితీలిచ్చి యూబీఎస్‌ను ఎట్టకేలకు ఒప్పించారు. 3 బిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లకు (3.23 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేయనున్నట్టు ఆదివారం ఆర్థరాత్రి తర్వాత ప్రకటన వెలువడింది.
డీల్‌లో భాగంగా యూబీఎస్, క్రెడిట్ స్విస్లకు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ 100 స్విస్ ఫ్రాంక్‌ల (108 బిలియన్ డాలర్లు) లిక్విడిటీ సదుపాయాన్ని కల్పిస్తుంది. అలాగే టేకోవర్ కారణంగా వచ్చే నష్టాల్లో 9 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల వరకూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అల్లకల్లోలమైన ఫైనాన్షియల్ మార్కెట్లను ఈ డీల్ స్వాంతనపరుస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లు పేర్కొన్నాయి.