Coca-Cola | పెండ్లయినా.. కుటుంబ వేడుకైనా.. ఒక కార్పొరేట్ సంస్థ కార్యక్రమమైనా కూల్ డ్రింక్స్ కావాలంటే ‘కోకోకోలా’ ఎంతో పాపులర్. అంత పాపులర్ శీతల పానీయాల సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ‘రెడీ టు డ్రింక్ టీ` ఉత్పత్తుల రంగంలోకి ఎంటర్ కానున్నట్లు ప్రకటించింది. ఈ రంగంలో ‘హానెస్ట్ టీ (Honest Tea)’ ఉత్పతిని మార్కెట్లో ఆవిష్కరించనున్నది. లెమన్-తులసీ, మ్యాంగో వేరియంట్లతో కలగలిపిన ఐస్డ్ గ్రీన్ టీ లభిస్తుందని కోకోకోలా అండ్ సౌత్ వెస్ట్ ఏసియా సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
కోకోకోలా కంపెనీ అనుబంధ సంస్థ ‘హానెస్ట్ (Honest)’. కోల్కతా కేంద్రంగా పని చేస్తున్న లుక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్ వారి మకాయిబారీ టీ ఎస్టేట్ నుంచి ‘ఆర్గానిక్ గ్రీన్ టీ`ఉత్పత్తులతో ‘హానెస్ట్ టీ’ని తయారు చేయనున్నదని తెలుస్తున్నది. ఈ మేరకు కోల్కతాలో జరుగుతున్న ఏడో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బీజీబీఎస్)లో రెండు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. కస్టమర్లకు విస్తృత స్థాయిలో బేవరేజెస్ ఆప్షన్లు అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ఈ ఉత్పత్తిని ఆవిష్కరిస్తున్నామని కోకోకోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా సీనియర్ అధికారి తెలిపారు.