Kia Sonet | ఆయనకు మ్యూజిక్ అంటే ప్రాణం.. అందుకే కారులో మ్యూజిక్ సిస్టమ్ అప్గ్రేడ్ కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.29 లక్షలు ఖర్చు చేశాడు. అసలు ఆ కారు ధర సుమారు రూ.14 లక్షలే. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా సోనెట్ మోడల్ కారు. ఈ కారు టాప్ హై ఎండ్ వర్షన్లో బోస్ ప్రీమియం సెవెన్-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఫీచర్ జత చేశారు. కానీ ఈ సంగీత ప్రియుడికి కారులో అందుబాటులో ఉన్న ఫీచర్లు సంత్రుప్తినివ్వలేదు. తాను అనుకున్న రీతిలో మ్యూజిక్ సిస్టమ్లో మార్పులు చేర్పులు చేశారు.
కియా సోనెట్ ఎక్స్ లైన్ వేరియంట్ 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ డీసీటీ వేరియంట్ ధర రూ.13.89 లక్షలు (ఎక్స్ షోరూమ్), 1.5 లీటర్ల ఏటీ వేరియంట్ ధర రూ.14.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).. ఈ రకంగా చూసినా కియా సొనెట్ కారు ధరతో పోలిస్తే.. మ్యూజిక్ సిస్టమ్ అప్గ్రేడ్ కోసం చేసిన ఖర్చు దాదాపు రెండింతలు.
సదరు మ్యూజిక్ ప్రియుడు తన కియా సొనెట్ కారులో ఫోకల్ ఉటోపియా ఎం స్పీకర్స్, హెలిక్స్ ఆల్ట్రా డీఎస్పీ, గ్రౌండ్ జీరో రిఫరెన్స్ ఆంప్లిఫయర్స్, ఫోకల్ బెరిలియం ట్వీటర్స్ వంటి ప్రీమియం కాంపొనెంట్స్తో కూడిన ఆడియో సిస్టమ్ అప్ గ్రేడ్ చేశాడు. అదనంగా క్యాబిన్ నాయిస్ లెవెల్స్ సమర్థవంతంగా తగ్గించడంతోపాటు సమగ్ర సౌండ్ ఫ్రూపింగ్, గందరగోళాలు కనీస స్థాయికి తేవడం ద్వారా ఓవరాల్ సౌండ్ క్వాలిటీ పెంపొందించుకున్నాడు.