Byju’s | ఆర్థిక సమస్యలతో కష్టాల్లో చిక్కుకున్న ఎడ్యూటెక్ స్టార్టప్ బైజూ`స్ (Byju’s)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికాలోని బైజూ’స్ యూనిట్‌ను రుణ దాతలు స్వాధీనం చేసుకోవడం సబబేనని డెలావేర్ కోర్టు తీర్పు చెప్పింది. రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైనందున అమెరికాలోని బైజూ’స్ అనుబంధ సంస్థ ‘బైజూ’స్ ఆల్ఫా’లో బైజూ రవీంద్రన్ స్థానే రుణ దాతలు ఒక డైరెక్టర్‌ను నియమించడం సబబేనని తెలిపింది.
బైజూ’స్ సంస్థకు రెడ్ వుడ్ ఇన్వెస్ట్ మెంట్స్, సిల్వర్ పాయింట్ క్యాపిటల్ సహా పలు సంస్థలు 120 కోట్ల డాలర్ల రుణం ఇచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి తర్వాత ఎడ్ టెక్ బిజినెస్ దెబ్బ తినడంతో.. బైజూ’స్.. రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. దీంతో అమెరికా రుణ దాతలు బైజూ’స్ అనుబంధ ‘బైజూ’స్ అల్ఫా’లో టీమోటీ పోల్ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ బైజూ’స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను డెలావేర్ కోర్టు తోసిపుచ్చింది. రుణ ఎగవేతలకు పాల్పడినందు వల్ల టీమోటీ పోల్ నియామకం సరైన చర్య అని పేర్కొంది.మరోవైపు, సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బైజూ’స్ గత నెలలో మరో 600 మంది ఉద్యోగులను తిలగించింది. కంటెంట్, మార్కెటింగ్ టీంలను తొలగిస్తున్నట్లు తెలిపింది.