Home Loan | మనలో చాలా మందికి సొంతిల్లు కొనుక్కోవాలన్న లక్ష్యం ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్నా.. అది మన సొంతిల్లు అన్న భావన.. ఎప్పటికీ కలుగదు. ప్రస్తుతం పెరిగిపోతున్న ధరలతో సొంతింటి కల నిజం చేసుకోవాలంటే బ్యాంకుల్లో ఇంటి రుణం తప్పనిసరి. కనుక బ్యాంకు రుణంపై సొంతిల్లు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంటి రుణం తీసుకున్న తర్వాత నెలవారీ ఈఎంఐ వాయిదాల్లో చెల్లించడానికి మీ వద్ద ఆర్థిక వనులు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పరిగణనలోకి తీసుకోవాలి. అటువంటి అవకాశాల్లేనప్పుడు మీరు ఇంటి రుణం పొందేందుకు అర్హత సాధించలేరు. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే.. తీసుకునే ఇంటి రుణంపై బ్యాంకులు అధిక వడ్డీ వడ్డించే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే నెలవారీ ఈఎంఐ మోయలేని భారంగా పరిణమిస్తుంది.
ఈ సమస్యలన్నీ అధిగమించి ఇంటి రుణం తీసుకునేందుకు సిద్ధమైతే.. సంబంధిత బ్యాంకుతో రుణ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా ముందుకెళ్లాలి. ఆ రుణం చెల్లించడానికి దశాబ్దాలు కాకపోవచ్చు గానీ కొన్నేండ్ల పాటు మీరు రుణ గ్రహీతగానే ఉంటారు.
మీరు ఇంటి రుణం పొందడానికి నెలవారీగా మీరు పొందే ఆదాయం ఆధారాలకు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించాలి. మీరు వేతన జీవి అయితే.. మీరు పని చేస్తున్న సంస్థలో జాయినింగ్ లెటర్, గత మూడు నెలల పే స్లిప్‌లు, బ్యాంకులో మీ రుణ దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి ఫామ్ 26ఏఎస్ సమర్పించాలి.
మీరు తీసుకునే రుణం చెల్లింపునకు టెన్యూర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ రుణ గడువు ఆధారంగానే మీ నెలవారీ ఈఎంఐ ఖరారవుతుంది.
ఉదాహరణకు మీరు తొమ్మిది శాతం వడ్డీరేటుపై 15 ఏండ్ల టెన్యూర్ కింద రూ.10 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం.. మీ ఈఎంఐ సుమారు రూ.10,143. మీ టెన్యూర్ 20 ఏండ్లు ఉంటే ఈఎంఐ రూ.8,997 అవుతుంది.
ఇంటి రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ చెల్లించడానికి వీలుగా మీరు రెగ్యులర్ ఇన్‌కం సంపాదనపై దృష్టి పెట్టాలి. లేని పక్షంలో రుణ బకాయిలు రికవరీ చేయడానికి సంబంధిత బ్యాంకర్ మీ ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు రుణం తేలిగ్గా చెల్లించడానికి వీలుగా తక్కువ మొత్తంలో ఈఎంఐ ఖరారు చేసుకోవడం బెటర్‌గా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మీరు తీసుకునే రుణ మొత్తం కూడా కీలకం. మీరు చిన్న రుణం తీసుకుంటే భారీ మొత్తంలో ఈఎంఐ, పెద్ద మొత్తం రుణం తీసుకుంటే తక్కువ ఈఎంఐ ఎంచుకోవచ్చు.
కొన్ని బ్యాంకులు మీకు ఇంటి రుణంపై ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఆప్షన్ ఇస్తాయి. ఈ పరిస్థితుల్లో మీరు ముందు ఇంటి రుణం పొందిన తర్వాత.. అదే బడ్జెట్ లోపల ఇల్లు వెతుక్కోవాలి. అలాగే రుణ గ్రహీతలుగా మీరు మీ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇల్లు ఎంచుకుంటే.. బ్యాంకులు తదనుగుణంగా రుణ పరపతి కల్పిస్తాయి.
ఏ బ్యాంకైనా రుణం ఇవ్వాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తికి గల అర్హతల జాబితాలను చెక్ చేస్తుంది. కనుక రుణ గ్రహీత తన వయస్సు ఆధారంగా బ్యాంకు వెబ్సైట్లో రుణ పరిమితి చెక్ చేసుకుని.. అటుపై దరఖాస్తు పెట్టుకోవచ్చు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది.
ఇంటి రుణం తీసుకుంటున్నప్పుడు బ్యాంకుకు రుణ గ్రహీత ప్రీ పేమెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకర్‌తో ముందుగానే ప్రీ పేమెంట్ చార్జీల విషయమై చర్చించుకోవాలి.