ఇస్శార్ట్ ఇన్వెస్ట్మెంట్స్
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఓ ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పొదుపు పథకం. దీనివల్ల ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు, అధిక వడ్డీరేటు వంటివి ఈ పథకానికున్న ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం ఎస్ఎస్వై వడ్డీరేటు 8.2 శాతంగా ఉన్నది. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడికున్న మంచి అవకాశాల్లో తల్లిదండ్రులకు ఇదొకటి.
- ఎస్ఎస్వై నుంచి ఎఫ్డీలదాకా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన పెట్టుబడి పథకాలివే
పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం చేసే ప్లానింగ్ ఎంతో సమర్థవంతంగా ఉండాలి. ప్రభుత్వ పొదుపు పథకాల దగ్గర్నుంచి బ్యాంక్ డిపాజిట్ల వరకు అన్నింటినీ గమనిస్తేనే తెలివైన నిర్ణయాలను తీసుకోవచ్చు. పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం మరి. విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకే తల్లిదండ్రులు స్థిరమైన వృద్ధితో, సురక్షితమైన పెట్టుబడులను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ క్రమంలో ఈ మూడు పెట్టుబడులను పరిశీలిస్తే.. ఆకర్షణీయ రాబడులకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఓ ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పొదుపు పథకం. దీనివల్ల ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు, అధిక వడ్డీరేటు వంటివి ఈ పథకానికున్న ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం ఎస్ఎస్వై వడ్డీరేటు 8.2 శాతంగా ఉన్నది. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడికున్న మంచి అవకాశాల్లో తల్లిదండ్రులకు ఇదొకటి. అయితే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ఏటా కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.5 లక్షలతో ఖాతాను తెరుచుకోవచ్చు. ఖాతా తెరిచిన 21 ఏండ్లకు స్కీమ్ మెచ్యూరిటీ ఉంటుంది. అమ్మాయి వయసు 18 ఏండ్లు దాటినా, 10వ తరగతి ఉత్తీర్ణత పొందినా 50 శాతం సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. ఇక ఆడపిల్లల విద్య, పెండ్లి ఖర్చులకు ఈ పెట్టుబడి ఉపయోగకరంగా ఉంటుంది. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద డిపాజిట్లకు పన్ను మినహాయింపుంటుంది. అలాగే సెక్షన్ 10 కింద వడ్డీ ఆదాయానికి పూర్తిగా పన్నులుండవు. మెచ్యూరిటీ మొత్తానికీ పన్నులు వర్తించవు.
ఫిక్స్డ్ డిపాజిట్లు
చాలా కుటుంబాలకు ఇప్పటికీ నమ్మకమైన పెట్టుబడి సాధనాలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) ఉంటున్నాయి. రిస్క్ తక్కువ, స్థిరమైన రాబడులు వీటికున్న ఆకర్షణ. పైగా రెగ్యులర్ సేవిం గ్స్ ఖాతాలతో పోల్చితే ఎఫ్డీలపై వడ్డీరేటును అధికంగా పొందవచ్చు. ఇక కొన్ని బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేకంగా ఎఫ్డీ పథకాలను అందిస్తున్నాయి. వీటిపైన కొంతమేర అధిక వడ్డీరేట్లనూ ఆఫర్ చేస్తున్నాయి. దీంతో పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత మొత్తాన్ని ఎఫ్డీ చేసుకోవడం ఉత్తమం. పెద్దయ్యాక పిల్లల విద్య, ఇతర ఆర్థిక అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయి.
ఎన్పీఎస్ వాత్సల్య యోజన
తమ పిల్లల కోసం ఓ దీర్ఘకాలిక సంపదను సృష్టించాలనుకునే తల్లిదండ్రులకు ఎన్పీఎస్ వాత్సల్య యోజన చక్కని పథకం. మైనర్ల కోసం ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాను తల్లిదండ్రులుగానీ, వారి సంరక్షకులుగానీ ఎవరైనా తెరువవచ్చు. పిల్లల వయసు 18 ఏండ్లు దాటితే, ఖాతా దానంతటదే వారి పేరుకు మారిపోతుంది. ఏటా కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠ పరిమితి లేదు. వడ్డీరేటు 9.5 శాతం నుంచి 10 శాతం మధ్య ఉంటుంది. దీర్ఘకాలం సొమ్మును ఉంచడం వల్ల చక్రవడ్డీ ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా పిల్లల రిటైర్మెంట్ ఫండ్ను వారి చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు నిర్మించి అందించవచ్చు. తద్వారా చక్కని ఆర్థిక భద్రతను ఇచ్చినట్టవుతుంది. పైగా ప్రభుత్వ స్కీమ్ కావడం, లో-రిస్క్ ఆప్షన్లు ఉండటం కలిసొచ్చే అంశాలు.
– ఉద్యోగ కోతలు, ద్రవ్యోల్బణం విజృంభణ – అత్యవసర నిధి ఉన్నదా..?
గల్ఫ్ ఉద్రిక్తతలు, తద్వారా ముడి చమురు సరఫరాలో అంతరాయాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు.. ఇటీవలికాలంలో అన్ని రకాల వ్యాపారాలపై ఒత్తిళ్లను పెంచాయి. ఇదే సమయంలో కంపెనీలు ఏఐ ఆధారిత సేవల బలోపేతంపై దృష్టి పెట్టడం.. ఉద్యోగాల కోతలకు దారితీస్తున్నది. ఇక ద్రవ్యోల్బణం సమస్య సరేసరి. అన్నింటి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేది ఆర్థిక క్రమశిక్షణే. దానికి అద్దం పట్టేది అత్యవసర నిధి.
ఎందుకంత ముఖ్యం?
మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఉద్యోగం, ఉపాధి ఎప్పుడు దూరమవుతాయో అస్సలు ఊహించకుండా ఉన్నాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అత్యవసర నిధి ఉంటే కుటుంబ తక్షణ అవసరాలు, ఇంటి ఖర్చులకు ఢోకా ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఎంత తెలివైన పనో.. ప్రతి ఒక్కరూ అంతా సవ్యంగా ఉన్నప్పుడే ఓ పటిష్టమైన అత్యవసర నిధిని నిర్మించుకోవడం అంతే ముఖ్యం. ఆదాయం దూరమైన వేళ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఈ నిధి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేగాక ఎలాంటి ఒత్తిడి లేకుండా మరో ఉద్యోగం సంపాదించుకోవడానికీ దోహదం చేస్తుంది.
ఎంత కావాలి?
ముందుగా ప్రతి నెలా మీ ఆదాయం ఎంత? ఖర్చులు ఎలా ఉన్నాయి? అన్నది పరిశీలించుకోవాలి. రుణాల ఈఎంఐలు, కిరాణా వ్యయం, ఇంటి అద్దెలు, పిల్లల చదువులకు ఫీజులు, తల్లిదండ్రులు-కుటుంబ సభ్యుల కనీస వైద్య అవసరాల ఖర్చులు, ఇతర యుటిలిటీస్ చార్జీలను లెక్కించి అది ఎంత? అనేది చూసుకోవాలి. ఉదాహరణకు మీ ఆదాయం నెలకు రూ.50,000గా ఉన్నది. ఖర్చులు రూ.35,000గా ఉన్నాయి. దీంతో కనీసం 6 నెలలకు సరిపడా అత్యవసర నిధి అవసరం. అంటే రూ.2.10 లక్షలు కావాలి.
- అత్యవసర నిధిలో దాదాపు 20-30 శాతం సేవింగ్స్ అకౌంట్ లేదా బహుళ ప్రయోజనాలుండే స్వీప్-ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఏటీఎంల ద్వారా నగదును వెంటనే ఉపసంహరించుకోవచ్చు. యూపీఐ ద్వారా కూడా వాడుకోవచ్చు.
- 40-45 శాతం లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుకోవాలి. ఇవి స్వల్పకాలిక రుణ, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడిగా పెడుతాయి. సాధారణంగా వీటిని వేగంగా రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- 20-25 శాతం నిధిని స్వల్పకాలిక రుణ నిధుల్లో పెట్టుకోవచ్చు. అయితే మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి రాబడులుంటాయి. కాబట్టి నిపుణుల సలహాతో ముందుకెళ్లడం మంచిది.
- ఖర్చుల్ని తగ్గించుకోవడం, పొదుపు వంటివి కీలకం. అలాగే ఆరోగ్య, జీవిత బీమాలు తప్పనిసరిగా ఉండాలి.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

