ఒమాహ (అమెరికా), నవంబర్ 4: వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథ్‌వే ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి (క్యూ3)గాను శనివారం ఏకంగా 12.8 బిలియన్ డాలర్ల (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టాలను ప్రకటించింది. దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు కోల్పోయినైట్టెంది. సంస్థ పెట్టిన పెట్టుబడుల విలువ తగ్గిపోవడమే ఇందుకు కారణం. కాగా, గత ఏడాది క్యూ3లో 2.8 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఒక్కో ఏ రకం షేర్ విలువ రూ.1,907 డాలర్లు పడిపోయింది.
అయితే ఈసారి ఈ నష్టం దాదాపు ఐదింతలు కావడం గమనార్హం. మరోవైపు బెర్క్‌షైర్ హాథ్వేకు చెందిన బీమా రంగ సంస్థల ప్రదర్శన ఈసారి బాగున్నట్టు చెప్తున్నారు. నిర్వహణ లాభం 2.4 బిలియన్ డాలర్లు పెరిగేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు కృషి చేశాయి. ఇదిలావుంటే ఈ ఏడాది బఫెట్ పెట్టుబడులు పెద్దగా లేకపోవడంతో బెర్క్‌షైర్ హాథ్‌వే వద్ద నగదు నిల్వలు ఈ సెప్టెంబర్ ఆఖరు నాటికి 157.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది జూన్ చివరితో పోల్చితే సుమారు 10 బిలియన్ డాలర్లు పెరిగాయి. నాడు 147.4 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.