Boeing | అమెరికాలో ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ (Boeing)కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) గట్టి షాక్ ఇచ్చింది. ‘బోయింగ్ 737 మ్యాక్స్ (Boeing 737 Max)’ విమానాల తయారీ విస్తరణపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. సదరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎఫ్ఏఏ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నెల ప్రారంభంలో అలష్కా ఎయిర్ లైన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానం టైర్ గగనతలంతోనే పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానాన్ని పూర్తి స్థాయి తనిఖీలు చేసిన తర్వాతే సర్వీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీ విస్తరణపై నిషేధం విధిస్తూ ఎఫ్ఏఏ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర పరిణామం.
యూఎస్ ఎఫ్ఏఏ నిర్ణయం అమెరికా ఎయిర్‌లైన్స్ .. అలస్కా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు రిలీఫ్ కల్పించింది. వేల ‘బోయింగ్ 737 మ్యాక్స్` విమానాలను ఈ రెండు ఎయిర్ లైన్స్ నేలకు పరిమితం చేశాయి. శుక్ర, ఆదివారాల్లో ఈ విమాన సర్వీసులను నడుపాలని ఈ రెండు సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల తయారీ విస్తరణను నిషేధిస్తూ యూఎస్ ఎఫ్ఏఏ తీసుకున్న నిర్ణయంతో విమానయాన రంగంలో పలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. జెట్ విమానాల మార్కెట్లో వాటికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి పెంచేందుకు అనుమతించాలని ఎఫ్ఏఏను బోయింగ్ యాజమాన్యం కోరింది.
కానీ బోయింగ్ యాజమాన్య అభ్యర్థనను అంగీకరించే ప్రసక్తే లేదని యూఎస్ ఎఫ్ఏఏ తేల్చి చెప్పింది. ‘బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో క్వాలిటీ కంట్రోల్ సమస్యలు పరిష్కారం అయ్యాయని మేం సంత్రుప్తి చెందే వరకూ ఆ విమానాల తయారీని విస్తరించేందుకు బోయింగ్ నుంచి వచ్చే ఏ విజ్ఞప్తిని అంగీకరించబోం’ అని ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ మైక్ వైటేకర్ చెప్పారు. ‘క్వాలిటీపై బోయింగ్ యాజమాన్యం ఇచ్చే హామీలు మాకు ఆమోదయోగ్యం కాదు’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలవారీగా ఇచ్చిన లక్ష్యం వరకు మాత్రం బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీకి మాత్రమే అనుమతిస్తామని, అంతకు మించి విస్తరించడానికి వీల్లేదన్నారు. ఈ విమానాల తయారీ పెంపుపై విధించిన ఆంక్షలు ఎంత కాలం అమల్లో ఉంటాయన్న సంగతి మాత్రం వైటేకర్ స్పష్టత ఇవ్వలేదు. ఎఫ్ఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరిస్తామని, ఎఫ్ఏఏకు సహకరిస్తామని బోయింగ్ పేర్కొంది.