Zomato | ‘చీఫ్ ఆఫ్ స్టాప్’ బాధ్యతలపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ క్లారిటీ ఇచ్చారు. కేవలం దరఖాస్తులను వడపోయడానికి మాత్రమే ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు రూ.20 లక్షలు ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఇంత మొత్తం నగదు చెల్లించగల సామర్థ్యం గల ఆర్థిక స్థోమత గల అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. చీఫ్ ఆఫ్ స్టాప్ ఉద్యోగానికి ఎంపికైన వారు రూ.20 లక్షల ఫీజు చెల్లించాలని జొమాటో చీఫ్ దీపిందర్ గోయల్ పెట్టిన షరతుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఉద్యోగ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. సుమారు 18 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని వచ్చే వారంలో పరిశీలిస్తామన్నారు. తమ సంస్థకు సరైన వ్యక్తులని భావించిన వారిని సంప్రదిస్తామన్నారు. రూ.20 లక్షల ఫీజు చెల్లించే సామర్థ్యం, ఆర్థిక స్తోమత గల వారిని, దాని గురించి కనీసం ప్రస్తావించిన వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని దీపిందర్ గోయల్ తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో పోస్టు చేశారు.