న్యూఢిల్లీ/కూపర్టినో, ఏప్రిల్ 21: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు యాపిల్‌కు కొత్త సీఈవో రాబోతున్నారు. ఎప్పట్నుంచో నాయకత్వ బదిలీ ప్రణాళికల్ని రచిస్తున్న సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. ఎట్టకేలకు తమ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ టెర్నస్‌ను కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు యాజమాన్యం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న టెర్నస్ సీఈవో బాధ్యతల్ని స్వీకరిస్తారు. దీంతో 15 ఏండ్లుగా యాపిల్ సారథిగా ఉన్న టిమ్ కుక్.. మరో 5 నెలల్లో తప్పుకోనున్నారు. అప్పటిదాకా జాన్ టెర్నస్‌కు మార్గదర్శిగా ఉంటూ ఆయన్ను లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి కుక్ తీసుకెళ్లనున్నారు.
ఆ తర్వాత కంపెనీ బోర్డుకు ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే ప్రపంచ టెక్నాలజీ మార్కెట్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ) శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో యాపిల్ వంటి బడా కంపెనీ పగ్గాలు టెర్నస్ చేతికి వచ్చాయి. మరి ఈ బాధ్యతల్ని ఆయనెంత సమర్థవంతంగా నెరవేరుస్తారన్నదానిపైనే యావత్తు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది. కాగా, యాపిల్ హార్డ్‌వేర్ బాస్‌గా ఉన్న టెర్నస్.. ఈ సంస్థలో చేరకముందు వర్చువల్ రిసెర్చ్ సిస్టమ్స్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారు.
రాబోయే సంవత్సరాల్లో మేము ఏం సాధించగలమో దానిపై నేను ఆశావాదంతో ఉన్నాను. యాపిల్ విజయాలను ఇకపైనా ముందుకు తీసుకెళ్తానని మాటిస్తున్నాను. కస్టమర్లు మెచ్చే రీతిలో మరెన్నో ఉత్పత్తులు, ఆవిష్కరణల్ని తీసుకొస్తాం. స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్ సారథ్యంలో పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.
-జాన్ టెర్నస్, యాపిల్‌కు కాబోయే సీఈవో
యాపిల్‌ను నేను ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటాను. అత్యుత్తమ ఉత్పత్తుల్ని, సేవల్ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా యాపిల్ వినియోగదారులను సంతృప్తిపరుస్తున్న ఎంతో తెలివైన, సృజనాత్మకతతోకూడిన సిబ్బందితో పనిచేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం. అందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది.
-టిమ్ కుక్, యాపిల్‌ను వీడుతున్న సీఈవో