న్యూఢిల్లీ : రాబడి పడిపోతుండటంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటుకు తెగబడుతోంది. 18,000 మందిపై వేటు వేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన అమెజాన్ బ్రిటన్‌లో మూడు వేర్‌హౌస్‌లను మూసివేస్తుండటంతో మరో 1200 మందిని సాగనంపేందుకు సన్నద్ధమైంది. వ్యాపార మెరుగుదల కోసమే వేర్‌హౌస్‌లను మూసివేయాలని నిర్ణయించామని అమెజాన్ చెబుతోందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు, కస్టమర్లకు మెరుగైన సేవలందించే క్రమంలో కొన్ని వేర్‌హౌస్‌ల మూసివేత, మరికొన్నింటిలో విస్తరణ చేపడతామని, అవసరమైన చోట న్యూ సైట్స్‌ను ఓపెన్ చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందిని ఇతర సేవలు, అమెజాన్ సైట్స్‌లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. రాబోయే మూడేండ్లలో అమెజాన్ రెండు నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని, ఫలితంగా 2500 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఈకామర్స్ కంపెనీ పేర్కొంది.