Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంగ్లీష్ పత్రిక ‘బ్లూమ్‌బర్గ్’ ఓ కథనంలో వెల్లడించింది. మొత్తం అప్పుల్లో బాండ్ల ద్వారా సేకరించిన రుణాలు 39 శాతానికి చేరినట్టు వివరించింది. అంతర్జాతీయ బ్యాంకుల నుంచే 29 శాతం వరకు అప్పులను అదానీ గ్రూప్ సేకరించినట్టు పేర్కొంది. మిగతా 71 శాతం రుణాలను దేశంలోని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, బాండ్ల నుంచి తీసుకున్నట్టు సమాచారం. కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీలు.. దేశీయ బ్యాంకుల నుంచి రూ. 81,234 కోట్లు (38 శాతం) సమీకరించినట్టు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఎల్ఎస్ఏ ఇటీవల తెలిపింది. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 90 శాతం అప్పులను ప్రభుత్వ రంగ బ్యాంకు ల నుంచే అదానీ గ్రూప్ తీసుకోవడం విశేషం.
కమోడిటీస్ ట్రేడింగ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ క్రమేపీ గనులు, రేవులు, విద్యుత్తు ప్లాంట్లు, విమానాశ్రయాలు, డాటా సెంటర్లు, సిమెంట్, మీడియా, రక్షణ ఉత్పత్తుల తయారీ ఇలా దాదాపు 30కి పైగా రంగాల్లోకి ప్రవేశించింది. గతంలో ఏ మాత్రం అనుభవంలేని రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవేమీ ఆలోచించకుండా వ్యాపార విస్తరణలో భాగంగా అదానీ గ్రూప్ కంపెనీలు విపరీతంగా అప్పులు చేసుకుంటూ పోతున్నాయి. దీనిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ గత ఆగస్టులోనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ గ్రూప్ కంపెనీలు రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఎడాపెడా తీసుకున్న రుణాల్నే ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో అదానీ కంపెనీలు పెట్టుబడులుగా మళ్లిస్తున్నాయంటూ వెల్లడించింది. అధిక రాబడుల్ని ఆశించి, రుణ పెట్టుబడులతో చేపట్టిన వృద్ధి ప్రణాళికలు.. పరిస్థితులు ప్రతికూలిస్తే రుణ ఊబిలోకి దించుతాయని, ఒకట్రెండు గ్రూప్ కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంటుందంటూ తెలిపింది. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల రుణాలు అంతకంతకూ పెరుగుతుండటం, మార్కెట్ ఒడిదుడుకులు వెరసి ఫిచ్ హెచ్చరికలు నిజం కావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.