Compete with yourself | నీతో నువ్వే పోటీ పడు
-శ్రావ్య వేదికపై మాట్లాడుతుంటే విద్యార్థులంతా మంత్రముగ్ధులై వింటున్నారు. జీవితంలోగానీ, వ్యాపారంలోగానీ, చదువుకోవడంలోగానీ పోటీ అవసరమా? ప్రశ్న సంధించింది. సుమారు ఐదువందల మంది ఉన్నారు. ఆడిటోరియంలో ఇంజినీరింగ్ అన్ని బ్రాంచీల విద్యార్థులు, అన్ని సెమిస్టర్ల వారు ఉన్నారు. చెప్పండి! పోటీ వాతావరణం ఉండాలా.. వద్దా? అని కాసేపాగి తనే తిరిగి అంది. పోటీ ఉంటే మంచిదా? లేకుంటే మంచిదా? ఆడిటోరియం చర్చోపచర్చలతో వేడెక్కింది. ఇంజినీరింగ్ విద్యార్థులంతా చురుగ్గా సమాధానాలు చెబుతున్నారు. శ్రావ్య ఒక మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. తీరిక సమయాల్లో ప్రొఫెషనల్ కాలేజీల్లో గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటుంది. క్లిష్టతరమైన అంశాల్ని సైతం సులభంగా అర్థమయ్యేలా చెప్పటంలో అందెవేసిన చెయ్యి. ఓ చిన్నపాటి చర్చ అనంతరం పోటీ ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు అందరూ.
పోటీ వాతావరణం ఉండటం అనేది ఏ రంగానికైనా అవసరం. ఉద్యోగులకు, విద్యార్థులకు కూడా పోటీ అనేది మంచిది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. మీరసలు ఎవరితో పోటీ పడాలి? ఈ ప్రశ్న సంధించి శ్రోతల సమాధానానికి ఎదురుచూశారు. ఎవరయినా సరే నెంబర్వన్తోనే పోటీ పడతారు కదా! ఇదేం ప్రశ్న అన్నట్లు చూశారు. అదే భావనను తమ సమాధానంగా చెప్పారు ముక్త కంఠంతో. అవుననిగానీ, కాదనీగానీ చెప్పకుండా సరే అయితే మీ అందరికి ఓ చిన్న కథ చెబుతాను. అందులో సమాధానం దొరకుతుంది
-ఓ కార్ల కంపెనీ సేల్స్ రివ్యూ మీటింగ్ జరుగుతోంది. అందరూ తమ నెలవారీ అమ్మకాలను వివరించుకుంటూ అభినందనలు పొందుతున్నారు. ఇంచుమించు అందరూ అంచనాలకు తగినట్టు అమ్మకాలు సాగించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్స్ సేల్స్ వివరాల పట్టిక
-Mr.A – 95శాతం అచీవ్మెంట్
-Mr.B – 97శాతం
-Mr.C – 99 శాతం
-Mr.D – 90 శాతం
-Mr.E – 98 శాతం
-Mr.F – 100 శాతం
-Mr.G – 35 శాతం
-అందరిలో తక్కువ అచీవ్మెంట్ సాధించింది Mr.G. సహజంగానే మేనేజ్మెంట్వారు Mr.Gని పిలిచి చీవాట్లు పెట్టారు. కానీ వారి ట్రెయినింగ్ మేనేజర్ చాలా అనుభవజ్ఞుడు. చాలా నెమ్మదస్తుడు. ఆయన ఆ కుర్రాడికి ఒకటి చెప్పాడు. నీవు మీ టీమ్‌లో ఒకే ఒక్కడితో పోటీపడు అంతే ఆ రివ్యూ మీటింగ్ అనంతరం ఆ కుర్రాడి అమ్మకాలు దినదిన ప్రవర్థమానమయ్యాయి. వారి టీంలోనే కాదు రాష్ట్రంలో నంబర్‌వన్, దేశంలోనూ నంబర్‌వన్ స్థాయికి త్వరలోనే ఎదిగాడు. ఇంతకి అతను పోటీ పడిందెవరితో తెలుసా? వారి ట్రెయినింగ్ మేనేజర్ చెప్పిన ఆ ఒకే ఒక పోటీదారుడెవరో తెలుసా?. వారి మేనేజర్ చెప్పిన విజయ రహస్యం ఒకటే. నీతో నీవు పోటీ పడు, నిన్ను ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరితో పోటీ పడవద్దు. ఇతరులతో పోటీ పెట్టుకోవద్దు.
కానీ అందరినీ గమనించు నంబర్‌వన్‌లో ఉన్న వాడిని లక్ష్యంగా పెట్టుకో. కానీ పోటీ నీవు నీతోనే పెట్టుకో. ఈ రోజు నిన్నటి కన్నా మెరుగ్గా ఉండాలి. రేపు ఈ రోజు కంటే మిన్నగా ఉండాలి. ఇదే నీతో నీవో పోటీ పడటమంటే అర్థం. నీతో నీవ్వు పోటీ పడటం వల్ల లాభాలు ఉన్నాయి. సునాయాసంగా నీ ప్రగతిని నీవు రోజురోజుకూ గమనించుకోవచ్చు. ప్రతిరోజు నీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ఈ పోటీ చాలా అర్థవంతమైనది. ఎందుకంటే నీతో నీ పోటీ అనేది ఓ నిరంతర ప్రక్రియ. కాబట్టి నీవు ఎల్లప్పుడూ ప్రగతిబాటలో ముందుండవచ్చు. అదే వేరే ఎవరితోనైనా పోటీ పెట్టుకున్నావనుకుందాం. ఇది అర్థవంతం కాదు.
ఎందుకంటే
-మీ మధ్య మరీ ఎక్కువగా ఉన్న అంతరం వల్ల నిరాశకు గురికావచ్చు.
-పోనీ మీకు దగ్గరలో ఉన్న నెక్ట్స్ బెస్ట్‌తో పోటీ పెట్టుకున్నారనుకుందాం. దీనిలో మీరు విజేతగా నిలిచినా, మీరు పోటీ పడటం ఆపేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని అధిగమించగానే మనం రిలాక్సవడం సహజమే కదా.
-కాబట్టి నంబర్‌వన్‌తో పోటీ వద్దు, మిగతా వారితో పోటీ అసలే వద్దు.
-మీతో మీరే పోటీ పడండి. ఈ పోటీవల్ల మీరు దినదిన ప్రవర్థమానమవుతారు.
ఈ సూత్రం ప్రతిఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ సూచన చాలా అవసరం. తన ఉపన్యాసాన్ని శ్రోతల కరతాళధ్వనుల మధ్య ముగించింది శ్రావ్య.
Read Today's Latest Breaking-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

