Marriage | సారీ.. నిన్ను పెళ్లి(Marriage) చేసుకుంటే మా అమ్మ చనిపోతానంటుంది అని ఓ పెళ్లికూతురు హ్యాండ్ ఇవ్వడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. . ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం చేస్తున్న కడపకు(Kadapa) చెందిన యువతికి వేంపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తనకంటే వయసులో చిన్న వాడైన ప్రసాద్‌ను పెళ్లి చేసుకునేందుకు సదరు యువతి సిద్ధపడింది. ఈ క్రమంలో రైతులకు ఇవ్వాల్సిన పశువుల దాణా రెండు బస్తాలు ఎక్కువ ఇచ్చేసరికి, కాబోయే కోడలు చాలా మంచిదని మురిసిపోయిన ప్రసాద్ తల్లిదండ్రులు. నిన్న(బుధవారం) ఉదయం ఇద్దరికీ పెద్దలు పెళ్లి నిశ్చయించారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి రూ.1.50 లక్షలతో ఇరువురు పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేశారు. ప్రసాద్ కుటుంబ సభ్యులు వారం రోజుల నుంచి వీధిలో షామియానా, ఇంటికి లైట్లు వేసి, వాడలో అందరికీ భోజనాలు పెట్టి పెళ్లి వేడుకలు ఘనంగా చేసుకున్నారు.
అయితే పెళ్లి ముహూర్తం రోజు మండపానికి ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని యువతికి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో భయపడ్డ ప్రసాద్ కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేయగా.. “సారీ” అని మెసేజ్ చేసింది. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసి.. నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతానంటుంది అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10 లక్షలు ఖర్చు చేయించిందని, న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, సదరు యువతి గతంలో కూడా ఇలాగే రెండు పెళ్లిళ్లు చేసుకుని డబ్బులు వసూలు చేసిందని, ప్రసాద్ బాబాయి కొడుకు నుంచి కూడా రూ.40 వేలు ఖర్చు చేయించిందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.