విజయవాడ: సోషల్ మీడియాలో వైరల్ అయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినలే అని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. ఈ వీడియోను అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించగా.. వైరల్ అయిన వీడియోనే పక్కా ఒరిజనల్‌ది అని నివేదిక ఇచ్చారని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో అమెరికా ఫోరెన్సిక్ రిపోర్టను చదివి వినిపించారు. అనంతపురం ఎస్పీపై ఒత్తిళ్లు తీసుకొచ్చి అలా చెప్పించినట్లుగా తాము భావిస్తున్నామన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో ఫేక్ కాదని, అదే ఒరిజినల్ అని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదించిందని పట్టాభి చెప్పారు. అమెరికాలో ఉంటున్న తన సోదరుడి ద్వారా ఈ వీడియోను జిమ్ స్టేఫర్డ్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్, ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి రిపోర్ట్ తెప్పించినట్లు తెలిపారు. ఈ నెల 9 న వీడియోను ల్యాబ్‌కు పంపగా.. నాలుగు రోజుల్లోనే తమకు రిపోర్ట్ అందిందన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో గోరంట్ల మాధవ్‌దే అని పేర్కొన్నారు.
ఎలాంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండానే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప.. గోరంట్ల మాధవ్‌కు క్లీన్చిట్ ఎలా ఇస్తారని పట్టాభి ప్రశ్నించారు. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండానే ఎడిటింగ్ చేసిందీ, మార్ఫింగ్ చేసిందీ ఎలా తెలుస్తుందన్నారు. అమెరికా నుంచి తెప్పించిన ఫోరెన్సిక్ రిపోర్టును పోలీసులు, ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ రిపోర్ట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. ఎంపీ స్థాయిలోని వ్యక్తి తప్పు చేస్తే శిక్షించాల్సింది పోయి వెనకేసుకు రావడం ఏంటని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్, ఏపీ సర్కార్ సమాధానమివ్వాలని పట్టాభి డిమాండ్ చేశారు.
వెనకేసుకు రావడం సిగ్గుచేటు : వంగలపూడి అనిత
ఇదే మీడియా సమావేశంలో టీడీపీ మరో నేత వంగలపూడి అనిత కూడా మాట్లాడారు. అమెరికా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినందున ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్‌ను ఎంపీ అనడానికి సిగ్గుగా అనిపిస్తుందన్నారు. ఈ వీడియోను మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నారని ఆరోపించారు. వీడియోను అడ్డుపెట్టుకుని కుల రాజకీయాలు చేయాలనుకున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు. ఇంత జరుగుతున్నా మాధవ్‌ను వైసీపీ మహిళా మంత్రులు వెనకేసుకు వస్తున్నారని, ఇది మహిళా సమాజానికే సిగ్గుచేటు అని అభివర్ణించారు. అమెరికా రిపోర్ట్ ఆధారంగా మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా అని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు.