తిరుమల : శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భార్య షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే కు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.