Cini Acter Vishal | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండేండ్ల ముందే ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన ప్రత్యర్థి ఎవరో ఖరారైనట్లు వార్తలొచ్చాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ సిద్ధం అయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ దీనిపై సినీ నటుడు విశాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారాలన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు.
తాను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు వదంతులు వస్తున్నాయని విశాల్ వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమైనట్లు వార్తలు వచ్చాయని, వాటిని ఖండిస్తున్నాన్నారు. రాజకీయాల్లోకి రంగ ప్రవేశంపై తననెవరూ కలువలేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వార్తలెక్కడ్నించి వస్తాయో తెలియదన్నారు.
తాను ప్రస్తుతం సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నట్లు విశాల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని గానీ, చంద్రబాబుపై పోటీ చేయాలనే ఆలోచన గానీ తనకు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పలు చిత్రాల షూటింగ్లో విశాల్ బిజిబిజీగా ఉన్నారు. గత ఫిబ్రవరిలో `సామాన్యుడు` అనే సినిమాతో ప్రజల ముందుకు వచ్చారు.