బాసర, అక్టోబరు 19 : బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. అత్యధికంగా ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీ, అత్యల్పంగా రూ.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. అధికారులు విద్యార్థులకు ప్లేస్మెంట్లో మెళకువలు నేర్పించడంతో ఉద్యోగాలు వచ్చాయి. వీరిని వీసీ వెంకటరమణ అభినందించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
మా నాన్న షాహిద్ మటన్ షాప్ నడుపుతూ నన్ను, ఇద్దరు చెల్లెళ్లు, తమ్మునిడిని చదివిస్తున్నారు. మా అమ్మ షాహిద మాకు ఎప్పటికప్పుడు చదువులో పోటీ పడే తత్వాన్ని నేర్పించేది. తెలంగాణ ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలో పలు కంపెనీలను క్యాంపస్ ప్లేస్మెంట్ జరపాలని సూచించడంతో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించా. హూజోషేవ్ కంపెనీలో ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. ఉద్యోగ సాధనలో నాకు అవసరమైన మెళకువలు నేర్పించిన ట్రిపుల్ ఐటి ఫ్యాకల్టీకి రుణపడి ఉంటా. – మహ్మద్ అమ్రత్, వెల్కటూర్,
నిజామాబాద్, సీఎస్ఈ విభాగం
మా నాన్న చిత్రంజన్, అమ్మ అంజలి. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న వ్యవసాయం చేస్తూ నన్ను, అక్కను చదివించారు. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో గ్రిడిలెక్స్ కంపెనీలో ఏడాదికి రూ.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. యూనివర్సిటీ అధికారులు మాకు ప్లేస్‌మెంట్‌కు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు. యూనివర్సిటీ అధికారులకు నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటా.
– శివరాంగౌడ్, వెంకటాపురం,
మా నాన్న శంకర్ ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ, అమ్మ లక్ష్మీ బీడీ వర్కర్‌గా పని చేస్తూ నన్ను నా చెల్లిని చదివించారు. నా చెల్లెలు కూడా ట్రిపుల్ ఐటీలోనే పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. మేమిద్దరం కూడా బాసర ట్రిపుల్ ఐటీలో చదవుతుండడం చాలా ఆనందంగా ఉంది. గ్రిడ్లెక్స్ కంపెనీలో ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీతో ఇటీవల ఉద్యోగం పొందా. నాతో ఇక్కడే చదువుతున్న నా చెల్లికి కూడా కచ్చితంగా ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా.
– నాగరాజు, శివంపేట్, మెదక్, సీఎస్ఈ విభాగం
మా నాన్న ప్రకాశ్ ఊరూరా తిరిగి బట్టలు అమ్ముతూ అమ్మ సృజన బ్యూటీపార్లర్ నడుపుతూ నన్ను నా చెల్లిని కష్టపడి చదివించారు. ప్రస్తుతం చెల్లెలు ఎన్ఐటీ వరంగల్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో చదువుతోంది. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో హూజోసేవ్ కంపెనీలో రూ.15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం రెండు కంపెనీలో ఉద్యోగాలు రావడంతో ఎక్కువ ప్యాకేజీ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నా. ఇంటర్న్‌షిప్ అనంతరం వచ్చే సంవత్సరం మేలో ఉద్యోగంలో చేరుతా. ఇందుకు సహకరించిన ట్రిపుల్ ఐటీ అధ్యాపకులకు, అధికారులకు నా కృతజ్ఞతలు.
– ప్రణవ్, గోదావరిఖని, పెద్దపల్లి, సీఎస్ఈ విభాగం
మా నాన్న సాయిలు, అమ్మ వనిత. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ ఆశ వర్కర్‌గా పని చేస్తోంది. నన్ను నా చెల్లిని కష్టపడి చదివించారు. ట్రిపుల్ ఐటీలో సీటు దక్కడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. నా చదువు పూర్తయి ఇటీవల క్యాంపస్ ప్లేస్మెంట్లో గ్రిడ్లెక్స్ కంపెనీ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. చాలా సంతోషంగా ఉంది. బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
– నవీన్‌కుమార్, బొమ్మన దేవ్‌పల్లి, కామారెడ్డి, సీఎస్ఈ విభాగం.
మా నాన్న లింగారెడ్డి, అమ్మ రేణుక వ్యవసాయం చేస్తూ నన్ను నా చెల్లిని కష్టపడి చదివించారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు గ్రిడిలెక్స్ హైదరాబాద్ కంపెనీలో ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన తరువాత తల్లిదండ్రులకు సేవా చేస్తూ రుణపడి ఉంటా.
– నూతన్‌కల్, సూర్యపేట, సీఎస్ఈ విభాగం.