వ్యాధులను తట్టుకొని జీవించే శక్తినే ‘రోగ నిరోధక శక్తి’ అంటారు. తనకు చెందనిదాన్ని గుర్తించి, ‘ఇతర’ పదార్థంగా నిర్ధారిస్తుంది మనిషి శరీరం. ఆ పదార్థాన్ని నిర్మూలించి, విసర్జిస్తుంది కూడా. ఈ పని కోసం ‘యాంటీబాడీ’ అనే మాంసకృత్తులకు
సంబంధించిన పదార్థాన్ని కానీ, లింఫోసైట్స్ అనే ఒకరకమైన తెల్లరక్త కణాలను కానీ పురమాయిస్తుంది శరీరం. ఈ శక్తి మనుషులకు తల్లి నుంచి కానీ, అంతకుముందే సోకిన అంటువ్యాధుల వల్ల కానీ అభివృద్ధి చెందుతుంది.
ఇన్నేట్ ఇమ్యూనిటీ
జాతిపరంగా, వంశపారంపర్యంగా సంక్రమించే రోగ నిరోధక శక్తిని ‘ఇన్నేట్ ఇమ్యూనిటీ’ అంటారు. అంతెందుకు, జంతువుల్లో కనిపించే ఎన్నో వ్యాధులు మనుషుల్లో ఉండవు.
అదేవిధంగా మనుషుల్లోని అనేక వ్యాధులు
జంతువుల్లో ఉండవు. దీనికి కారణం.. ఆయా జాతులకు ఉన్న ‘ఇన్నేట్ ఇమ్యూనిటీ’ వ్యవస్థే అంటారు నిపుణులు.
యాక్టివ్ ఇమ్యూనిటీ
ఇది రోగ కారకాలైన బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలో ప్రవేశించడం వల్ల కానీ, టీకాల వల్ల కానీ లభిస్తుంది. ఈ రకమైన ఇమ్యూనిటీలో శరీరంలోనే రోగ నిరోధక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఈ శక్తి బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి చేరిన కొంతకాలం తర్వాతే వస్తుంది. అంతేకానీ, వెనువెంటనే రాదు.
పాసివ్ ఇమ్యూనిటీ
ఈ విధమైన ఇమ్యూనిటీలో ఇతరుల శరీరంలో లేదా జంతువుల్లో తయారైన యాంటీబాడీలను సేకరించి, శుద్ధిచేసిన తరువాత
ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. యాంటీటెటనస్ సీరం ఇందుకో ఉదాహరణ. ఈ విధానంలో యాంటీ
బాడీలు శరీరంలో ప్రవేశించగానే రోగ నిరోధక శక్తి వచ్చేస్తుంది. కానీ అది దీర్ఘకాలికంగా ఉండదు. శరీరంలో యాంటీ
బాడీల పరిమాణం తగ్గగానే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తల్లి నుంచి శిశువుకు ప్రసవం తర్వాత పాల ద్వారా లభించే యాంటీబాడీలు రెండవ రకం. ఇవి బిడ్డను మొదటి 6 నుంచి 9 నెలల వరకు కొన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఉదా: మీజిల్స్ వ్యాధి.
హెర్డ్ ఇమ్యూనిటీ
అంటువ్యాధులను తట్టుకొనే ప్రజల సామూహిక రోగ నిరోధక శక్తిని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంతకుముందు ఇచ్చిన టీకాలపై, గతంలో వచ్చిన రోగాలపై ఈ నిరోధకత ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి తక్కువగా ఉన్నప్పుడు అంటువ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందుతాయి. దీన్ని ‘ఎపిడెమిక్’ అంటారు. 90 శాతం పిల్లలకు టీకాలు ఇవ్వడం ద్వారా ఈ శక్తి పెరిగి, రోగాల వ్యాప్తి తగ్గి, కాలక్రమేణా ఆ జబ్బు కనిపించకుండా పోతుంది. అనేక సంవత్సరాల క్రితం నిర్మూలించిన స్మాల్‌పాక్స్, కొద్ది సంవత్సరాల క్రితం నివారించిన పోలియో వ్యాధులు ఇందుకు నిదర్శనం.
-డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి , పిల్లల వైద్య నిపుణులు