శుభకరీ.. సుఖకరీ.. సర్వమంగళే!
భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నవే! సనాతన ధర్మాన్ని అనుసరించేవారు ఈ ధర్మాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. ఈ క్రమంలో వ్రతాలు, నోములు, పూజలు మరెన్నో కనిపిస్తాయి. దైవానుగ్రహంతోపాటు మనల్ని మనం సంస్కరించుకోవడానికి పర్వదినాలు సోపానాలుగా ఉపయోగపడతాయి.
భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నవే! సనాతన ధర్మాన్ని అనుసరించేవారు ఈ ధర్మాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. ఈ క్రమంలో వ్రతాలు, నోములు, పూజలు మరెన్నో కనిపిస్తాయి. దైవానుగ్రహంతోపాటు మనల్ని మనం సంస్కరించుకోవడానికి పర్వదినాలు సోపానాలుగా ఉపయోగపడతాయి. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఒకటి శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు ముత్తయిదువలు.
లక్ష్మీదేవి.. శ్రీచక్ర సంచారిణిగా అద్భుతమైన సమ్మేళనమై శివకామేశ్వరిగా, మంగళ దేవతగా అనుగ్రహించే వేడుక వరలక్ష్మీవ్రతం. లలితాదేవి హ్రీంకార స్వరూపిణిగా, శివకామేశ్వరిగా వరాలిచ్చే శుభఘడియ ఇది. ఆ పరమేశ్వరి వరలక్ష్మిగా కరుణించే సుముహూర్తం శ్రావణ శుక్రవారం.
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధ మానసా॥
సుమంగళీ, సుఖకరీ, సువేషాఢ్యా, సువాసినీ.. ఇవన్నీ అమ్మవారి లక్షణాలను తెలియజేస్తాయి. ఇందులోని ప్రతి రూపం మనకో సందేశాన్ని ఇస్తుంది. ఈ నామాలతో అమ్మవారిని కీర్తించడమే కాకుండా, ఆ గుణాలను మనమూ అలవర్చుకోవాలి.
సుమంగళి:
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే॥
సర్వజనులకు మంగళకరమైన భావనలు కలుగజేసే రూపంతో సాక్షాత్కరించే దేవి మంగళగౌరి! తలలో పూలు, నుదుటిన బొట్టు, కంటికి కాటుక, మెడలో మాంగళ్యం, కాళ్లకు పసుపు పారాణి ఇష్టంగా పెట్టుకుంటారు మహిళలు. ఇవన్నీ సౌభాగ్య హేతువులే. వీటిని ధరించిన మహిళ సర్వ సౌభాగ్యాల స్వరూపంగా కనిపిస్తుంది. సుమంగళి మహిమ మంగళసూత్ర ధారణతో మొదలవుతుంది. భర్త అనారోగ్యవంతుడైనా, జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఇంతికి రక్షణగా నిలిచేది మాంగళ్యమే. అయిదోతనాన్ని అన్నివేళలా రక్షించే దేవి మంగళదేవత.
సుఖకరి: శ్రీమాత సుఖ స్వరూపిణి. కుమారి రూపంలో, సువాసిని రూపంలో ధ్యానించి, పూజించిన వారికి కావలసిన సుఖశాంతులను ప్రసాదిస్తుంది. సర్వజనుల సుఖాన్ని, క్షేమాన్ని కోరుకోవడంలోనే సుఖం, శాంతి రెండూ లభిస్తాయి. కుటుంబ అవసరాలను తీర్చడంలో తృప్తి కలుగుతుంది. సుఖం అనేది అనుభవానికి తీపి పదార్థం వంటిది. తీపిని అదేపనిగా తినడం వల్ల వెగటు పుడుతుంది. తీపి ఎల్లకాలం ఇష్టంగా ఉండదు. పరిస్థితి, అనుభవాలను బట్టి తీపిలోని రుచి మారుతుంది. క్రమంగా ఈ అనుభూతి మార్పును కోరుకుంటుంది. ఈ అనుభూతిని పూర్తిగా సొంతం చేసుకోవాలంటే ‘శ్రీమాత’ నామ జపం చేసుకోవాలి. అమ్మ అనుగ్రహం బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ద్వారా లభించే ఆనందం శాశ్వతమైన సుఖరసానుభూతిని కలిగిస్తుంది.

సువేషాఢ్య: సువేషాఢ్య అంటే అందమైన రూపం కలది అని అర్థం. తన కంటిచూపుతో ఈ అందమైన విశ్వాన్ని సృష్టించిన అమ్మవారి కంటే సౌందర్యం మరేం ఉంటుంది. తురీయ స్థితిలో సదాశివుడిని కూడా మోహింపజేసే రూపం అమ్మది.
సువాసిని: మాంగళ్యధారణతో స్త్రీ నిండుతనాన్ని సంతరించుకుంటుంది. సువాసినిగా కొత్త శోభతో అలరారుతుంది. భర్తపై ప్రేమ, కుటుంబ బాధ్యత, దైవభక్తి, పాతివ్రత్యం తదితర సుగుణాల కలయికతో దివ్యత్వాన్ని సంతరించుకోవాలి. అలాంటి ఇల్లాలిని అమ్మవారు అనుగ్రహిస్తుంది.
సువాసిన్యర్చన ప్రీత: సువాసినుల అర్చనతో ప్రీతి పొందే దేవత ఆమె. నిండు మనసుతో పూజించే వారంటే అమ్మవారికి ఇష్టం. బిల్వపత్రాలతో, కుంకుమతో పూజిస్తే సంతృప్తి చెందుతుంది. శ్రీచక్రార్చనలోనూ సువాసినీ పూజ అత్యంత ప్రధానమైనదిగా చెబుతారు. అంతేకాదు, యజ్ఞయాగాదులతో, పెండ్లికి ముందురోజు, ఉపనయనం సందర్భంగా గౌరీ పూజ చేయడం మన ఆచారంగా కనిపిస్తుంది.
శోభన: సర్వాభరణ భూషిత అయిన అమ్మవారి రూపమే శోభన! సౌందర్యం అంటే కేవలం బాహ్య సంబంధమైనది మాత్రమే కాదు. అంతఃకరణ కూడా చాలా ముఖ్యం. మనసులోని అవలక్షణాలన్నీ తొలగిపోయినప్పుడు మనకు అంతా శుభమే కలుగుతుంది. ఆ అవలక్షణాలను రూపుమాపే దేవతే శోభన!
శుద్ధమానస: భక్తి సమర్పణలో పేద, గొప్ప తేడాలు ఉండవు. కేవలం భక్తిని మాత్రమే చూసి నిష్పక్షపాతంగా స్వీకరిస్తూ, తమ వాంఛితార్థాలను నెరవేర్చే తల్లి శుద్ధ మానస! నిర్మలమైన మనసు కలిగిన దేవత ఆమె. కపటం లేని సత్యాన్ని ఆశ్రయిస్తుంది. మనసులో ఏ కల్మషం లేకుండా పవిత్రంగా ఉండటమే పరిశుద్ధత. అలాంటి సహృదయం కలిగిన భక్తులను అమ్మవారు వరలక్ష్మీదేవిగా సంపూర్ణంగా కటాక్షిస్తుంది.
సి.విజయలక్ష్మీ రాజం
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

