ఇప్పటికీ ఆడపిల్లలకు కఠిన ఆంక్షలే. తామేమిటో నిరూపించుకోవడం ఓ సవాలే. ఆ ప్రయాణంలో
ఒడుదొడుకులు తట్టుకోవాల్సిందే. వాటన్నిటినీ అధిగమించి చిన్నతెరపై మంచి స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్నది యశ్మీ గౌడ. స్టార్ మా ‘కృష్ణా ముకుందా మురారి’ సీరియల్‌తో ప్రేమకు అసలైన నిర్వచనమిచ్చే పాత్రను ధరిస్తున్నానంటూ యశ్మీ పంచుకున్న ముచ్చట్లు..
నేను పుట్టింది, పెరిగింది గార్డెన్ సిటీ బెంగళూరులోనే. చిన్నప్పటినుంచీ సినిమాలు బాగా చూసేదాన్ని. అద్దం ముందు నిలబడి నటీనటులను అనుకరించేదాన్ని. కాలేజీకి వచ్చాక మోడలింగ్‌పై దృష్టిపెట్టాను. ఇంట్లో వాళ్లకేమో సినిమా పరిశ్రమపై సదభిప్రాయం ఉండేది కాదు. దీంతో తొలినాళ్లలో ప్రోత్సాహం కరువైంది. అయినా నా కలల్ని చంపుకోలేదు.
ఓ కన్నడ చానల్లో ఏదో సీరియల్‌కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్లాను. అదే నా మొదటి ఆడిషన్. అయినా ఎంపికయ్యాను. అలా నా కెరీర్ ప్రారంభమైంది. పేరుతోపాటు అవకాశాలూ వచ్చాయి. ఆ సక్సెస్‌తో ‘స్వాతి చినుకులు’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. కొత్త చోటు, తెలియని భాష అని మొదట భయపడ్డాను కానీ, నన్ను నేను నిరూపించుకోవాలనే తపన ఆ భయాన్ని అధిగమించేలా చేసింది. మరో ఆలోచన లేకుండా హైదరాబాద్ ప్రయాణమయ్యాను. బెంగళూరు సరిహద్దులు దాటడం అదే మొదటిసారి. ఇక అప్పటినుంచీ హైదరాబాద్ నా రెండో ఇల్లుగా మారింది. వాతావరణంలో కాస్త మార్పు తప్పిస్తే.. రెండు నగరాలకూ పెద్ద తేడా ఉండదు. తెలుగు, కన్నడ.. తోబుట్టువులలాంటి భాషలు.
అచ్చమైన ప్రేమ కథ..
లాక్డౌన్లో షూటింగ్స్ ఆగిపోవడంతో కొంత డైలమాలో పడ్డాను. ఆ సమయంలోనే ‘నాగభైరవి’లో అవకాశం వచ్చింది. ‘త్రినయని’లోనూ ప్రత్యేక పాత్రలో కనిపించాను. ఇప్పుడు స్టార్ మా ‘కృష్ణా ముకుందా మురారి’లో ఓ కీలకపాత్ర పోషిస్తున్నా. ప్రేమ గొప్పతనాన్ని నిరూపించే విభిన్నమైన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సీరియల్ ఇది. ఈ తరంలో ప్రేమను సీరియస్‌గా తీసుకునేవాళ్లు చాలా తక్కువ. ఆ పవిత్రబంధాన్ని కాలక్షేపంగానో, వినోదంగానో భావిస్తున్నారు. అలాంటివారికి కనువిప్పు ఈ సీరియల్. నా భావాలకు దగ్గరగా ఉండే కథ ఇది. అన్నట్టు బెంగళూరులోని తెలుగువాళ్లు నన్ను గుర్తుపట్టి ‘హాయ్’ చెబుతూ ఉంటారు. అందులోనూ అమ్మానాన్నల ముందు నన్నెవరైనా సెల్ఫీ అడిగితే.. ఆ ఆనందమే వేరు. మొదట్లో తెలుగువాళ్లతోనూ ఇంగ్లిష్, కన్నడలో మాట్లాడేదాన్ని. కానీ కథ, డైలాగ్స్ అర్థం చేసుకోవాలంటే భాషా పరిజ్ఞానం తప్పనిసరి అనిపించింది. పట్టుబట్టి ఐదారు నెలల్లో తెలుగు నేర్చుకున్నా.
అంతా హ్యాపీస్..
మొదట్లో అడ్డుచెప్పినా, ఇప్పుడు నాన్న నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో అందరికంటే ముందు ఆయనే నా సీరియల్స్ చూస్తుంటారు. నాకు వ్యాపారం అంటే ఇష్టం. కిచెన్‌లో ఉపయోగించే సిరామిక్ పాత్రలు, మగ్గులు, కప్పులు తయారుచేసే బిజినెస్ ప్రారంభించాను. ఈమధ్యే కన్నడలో ఒక సినిమా అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మంచి పాత్ర లభిస్తే.. తెలుగు సినిమాల్లోనూ నటించాలని ఉంది.
– ప్రవళిక వేముల