అమెజాన్ ప్రైమ్ : స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: పరమ్‌వీర్ సింగ్ చీమా, రణ్వీర్ షోరే, శేఖర్ సుమన్, ఆంజన్ శ్రీవాస్తవ్, అల్ఫియా జాఫ్రీ, ఆశిష్ రాఘవ తదితరులు
దర్శకత్వం: శ్రేయాన్ష్ పాండే, ఆశిష్ ఆర్. శుక్లా
మన దేశంలో మధ్యతరగతి జనాలు ఎక్కువ. ఆశలు.. ఆశయాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎక్కడైనా ఎక్కువ లాభం వస్తుందంటే.. వెనకా ముందూ ఆలోచించకుండా పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు మోసానికి గురవుతుంటారు. అలాంటి మోసాల్లో మల్టీలెవల్ మార్కెటింగ్ ముందువరసలో ఉంటుంది. అలాంటి ఓ అతిపెద్ద మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్‌ల నేపథ్యంలో వచ్చిన వెబ్‌సిరీస్.. ద పిరమిడ్ స్కీమ్. అమెజాన్ ప్రైమ్ వేదికగా.. ఇటీవలే స్ట్రీమింగ్కు వచ్చింది. హరిద్వార్‌కు చెందిన గోల్డీ చౌహాన్ (పరమ్‌వీర్ సింగ్ చీమా) చుట్టూ ఈ ‘పిరమిడ్’ కథ తిరుగుతుంది. అతనిది ఉమ్మడి కుటుంబం. హరిద్వార్‌లోనే ఓ మొబైల్ స్టోర్ నడుపుతుంటాడు.
రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ బాధ్యతలతో ఆర్థికంగా సతమతం అవుతుంటాడు. గోల్డీ తాత (అంజన్ శ్రీవాస్తవ్) దగ్గర డబ్బు ఉన్నా.. కుటుంబానికి సహాయం చేయడానికి అతనికి మనసొప్పదు. ఈ క్రమంలో ఒకరోజు బ్యాంకు ఉద్యోగి అయిన చున్మున్ సింగ్ (విజయ్ కుమార్).. గోల్డీని కలుస్తాడు. అతణ్ని ఒక మల్టీ లెవల్ మార్కెటింగ్ నెట్‌వర్క్‌లోకి ఆహ్వానిస్తాడు. ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ చూసేందుకు చాలా సులభంగా కనిపిస్తుంది. ఇందులో చేరే ప్రతి ఒక్కరూ.. నలుగురు కొత్త సభ్యులను చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా నెట్వర్క్ వృద్ధి చెందడం ద్వారా ఆదాయం వస్తుందని చెబుతాడు చున్మున్. ఈజీ మనీ, అధిక లాభాలకు ఆకర్షితుడై.. గోల్డీ కూడా ఈ నెట్‌వర్క్‌లోకి దిగుతాడు.
ఇందుకోసం తన మొబైల్ స్టోర్ బిజినెస్‌ను కూడా వదిలిపెట్టి, నేరుగా ‘పిరమిడ్’ వ్యాపారంలోకి దూకుతాడు. ఈ ప్రయాణంలో గోల్డీకి మ్యూజిక్ టీచర్ అయిన మనోజ్ శ్రీవాస్తవ (రణ్వీర్ షోరే)తో స్నేహం ఏర్పడుతుంది. ఈ మనోజ్ కథ వేరేలా ఉంటుంది. అతను స్కూల్ నుంచి సస్పెన్షన్‌కు గురవుతాడు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ సక్సెస్ సాధించాలనే లక్ష్యంతో ఉంటాడు. అతను కూడా గోల్డీ వెంట మల్టీలెవల్ మార్కెటింగ్‌లోకి అడుగుపెడతాడు. ఇద్దరూ కలిసి ఒక్కో మెట్టు ఎక్కడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? త్వరగా డబ్బు సంపాదించాలనే వారి ఆశ నెరవేరుతుందా? ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లో చిక్కుకొని మధ్యతరగతి వాళ్లు డబ్బు ఎలా పోగొట్టుకున్నారు? అసలు ఈ నెట్వర్క్ వెనక ఉండేది ఎవరు? అతని గురించి తెలుసుకోవడానికి గోల్డీ, మనోజ్ ఎలాంటి సాహసాలు చేశారు? చివరికి ఈ క్రైమ్ సిండికేట్‌ను వారు బట్టబయలు చేశారా? అనేదే ఈ సిరీస్ కథాంశం.