అంకాపూర్ నాటుకోడి, ఎల్లిపాయ కారం, రొయ్యల వేపుడు, హైదరాబాదీ హలీం, డబుల్ కా మీఠా.. తెలంగాణ పేరెత్తితే నోరూరించే రుచులివి. ‘మాస్టర్ షెఫ్ ఇండియా సీజన్ 9’లో ఈ రుచుల ఘుమ ఘుమలు ఆకట్టుకోవడమే కాదు అదరహో అనిపించాయి. మార్చిలో జరిగిన ఫైనల్స్‌లో తెలంగాణ నాన్ వెజ్ వంటకాలతో సెకండ్ రన్నరప్ జోడీగా నిలిచారు తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ. తెలిసిన వంటకాల్ని కొత్త దినుసులతో రుచిగా ఉండేలా వండే ఈ రసవత్తర పాకయాగం ఆద్యంతం అలరించింది. ఈ పోటీలో ఆసక్తికరమైన రుచుల ముచ్చట్లతోపాటు తనవంటింటి ప్రయాణాన్నీ జిందగీతో ఇలా చెప్పుకొచ్చింది సాయిశ్రీ.
చిన్నప్పటి నుంచి కుకింగ్ నాకు ప్యాషన్. అమ్మ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు సాయం చేసేదాన్ని. అమ్మ ఎలా వంట చేసేదో దగ్గరగా గమనించాను. అయిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే నేనూ వంటలు చేయడం మొదలుపెట్టాను! మంచిర్యాల మా స్వస్థలం. నా చదువు కోసం హైదరాబాద్ వచ్చాం. నాన్న క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు. తనకు పెద్ద టీమ్ ఉంది. నాన్న క్యాటరింగ్‌కు వెళ్లినప్పుడు తనతోపాటు నేనూ పోయేదాన్ని. బీటెక్ (ఐటీ) చదివాను. నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌లోనే జాబ్ వద్దు, బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే రెస్టారెంట్ ఆలోచన వచ్చింది. ముందు చదువు పూర్తి చేద్దామనుకున్నాను. బీటెక్ పూర్తి కాగానే ఓ కంపెనీలో కొంతకాలం జాబ్ చేశాను. ఆ జాబ్ మానేద్దాం అనుకున్నప్పుడు.. ఆ కంపెనీ వాళ్లతోనే కలిసి ఓ రెస్టారెంట్ ప్రారంభించాను.
మన దేశంలో కుకింగ్ టాలెంట్‌ని గుర్తించే రియాలిటీ షో మాస్టర్ షెఫ్ ఒక్కటే. నాలుగేళ్ల క్రితం (బీటెక్ చదివేటప్పుడే) తెలుగు మాస్టర్ షెఫ్ పోటీ ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల వాళ్లకు కలిపి పోటీ పెట్టారు. అందులో టాప్ సిక్స్ వరకు వెళ్లాను. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా లెవెల్‌కి చేరుకుంటానని అనుకోలేదు. ఈ పోటీకి ఒకరు సహాయకులుగా ఉండొచ్చు. అలా నాకు మా అమ్మ సపోర్ట్‌గా వచ్చింది. మేము ఆడిషన్స్ ఇచ్చిన వారంలోనే ‘మీరు సెలెక్ట్ అయ్యారు. మూడు నెలలకు సరిపడా దుస్తులు సర్దుకుని వచ్చేయండి’ అన్నారు. అది 40 ఎపిసోడ్స్ రియాలిటీ షో. దాని కోసం హడావుడిగా ముంబైకి వెళ్లాం. ఫుడ్ గురించి పెద్దగా చదివి, తెలుసుకుని వెళ్లే అవకాశం, సమయం మాకు లేకుండే.

ముంబైలో జరిగిన మాస్టర్ షెఫ్ ఆలిండియా లెవెల్ కాంపిటీషన్లో తెలంగాణ నాటుకోడితో (ఫస్ట్ డిష్) మొదలుపెట్టాను. కాంపిటీషన్‌కి టాప్ 26 సెలెక్ట్ చేశారు. అందులో నేనూ ఉన్నాను. ఆ తర్వాత (సెకండ్ రౌండ్) అగ్ని పరీక్ష పెట్టారు. అంకాపూర్ చికెన్ గట్టెక్కించింది. సెకండ్ టాప్ లిస్ట్‌కి ఎంపికైన 18 మందిలో నాకు చోటు దక్కింది. వాళ్లలో టాప్ టెన్ తీశారు. నా టేస్ట్‌కి అందులోనూ చోటు దక్కింది. నాకు వెజ్ ఇష్టం. బయటికి వెళ్తే శాకాహార వంటకాల్లో వెరైటీలు చాలా తక్కువ ఉంటాయి. కానీ, ఇంట్లో ఎన్నో రకాల శాకాహార వంటకాలు వండుకోవచ్చు. నాన్ వెజ్ కుకింగ్ ఈజీ. ఉల్లిపాయలు, మిరపకాయలు కోస్తే అయిపోయినట్టే! వెజ్‌లో అన్నీ కోసి పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ వండాలి. షోలో సమయం ముఖ్యం. కాబట్టి పోటీలో నాన్‌వెజ్ వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. వెజ్ ఇష్టమే అయినా నాన్‌వెజ్ కూడా బాగా వండుతాను.
మాస్టర్ షెఫ్ ఇండియాలో ప్రతి రౌండ్లో వంటలు చేయడం, జడ్జీలను మెప్పించడం ఒక్కటే ఉండదు! ఇలాగైతే వంటల కాంపిటీషన్లో టేస్ట్ ఏముంటుంది? ఆ పోటీ నిర్వాహకులు ప్రతి రౌండ్లో ఏదో టాస్క్ ఇస్తారు. వాళ్లు చెప్పిన డిష్‌లను అప్పటికప్పుడు వండాలి. అంతేకాదు… ఆ వంటలను వాళ్లు ఇచ్చిన దినుసులతోనే చేయాలి. ఇదీ ఆ పోటీలో ఉండే కిక్. అన్ని దినుసులూ ఇచ్చి తెలిసిన వంటకం వండమంటే అందరూ వండుతారు. కానీ, వేరే ఇంగ్రీడియెంట్స్, వాళ్లు ఇచ్చిన పాత్రలు, సామగ్రితోనే మన వంటకాలు సిద్ధం చేయాలి. అదే రుచిని రప్పించే ప్రయత్నం చేయాలి. అంటే ఈ కాంపిటీషన్ పాకాల ప్రయోగశాల అన్నమాట! వాళ్లిచ్చిన ఇంగ్రీడియెంట్స్ మాత్రమే మనకు తెలిసిన వంటకు ఉపయోగించాలి. కాబట్టి ఏది ఎందులో కలిపితే కలిసిపోతుంది, అది ఎలాంటి రుచిని ఇస్తుందో ఒక అవగాహన కలిగి ఉండాలి. అదే విజేతలను నిర్ణయిస్తుంది. రియాలిటీ షో కాబట్టి అప్పటికప్పుడే చెబుతారు.
ఇచ్చిన దినుసులు, ఎదురుగా ఉన్న పాత్రలు, పరికరాలతో చెప్పిన వంటకం క్షణాల్లో వండాలి. ఆ సందర్భంలో (రియాలిటీ షో కాంపిటీషన్ జరిగేటప్పుడు) వాళ్లు చెప్పిన వంటకానికి సంబంధించిన దినుసులు అన్నీ అందుబాటులో ఉండవు. ఒక రౌండ్లో నాటుకోడి వండమన్నారు. తెలంగాణ డిష్‌లలో ఇది చాలా ఫేమస్. నాకు నాటుకోడి వండటం బాగా వచ్చు. కానీ, అక్కడ ఉన్న దినుసులతో వండాలి కాబట్టి నాటుకోడిని కోకోనట్ మిల్క్‌తో ఫోమ్ చేశాను. భలే టేస్ట్ వచ్చింది. సాధారణంగా మనం రొయ్యల వేపుడు, ఎల్లిపాయ కారం చేసుకుంటాం. ఫైనల్లో ఎల్లిపాయ కారం లాప్స్టర్ చేశాను. ఇలా ప్రతి డిష్‌ని కొత్త పద్ధతిలో వండే పోటీ ఇది. ఈ పోటీలాగే నా వంటల కెరీర్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నది. మా రెస్టారెంట్ ‘ఎల్లిపాయ కారం’ తెలంగాణ రుచులకు ప్రయోగశాల. ఎల్లిపాయ కారం బిర్యానీ, ఎల్లిపాయ కారం కోడి వేపుడు, పచ్చిమిర్చి కోడి వేపుడు, ఆలూఎల్లిపాయ కారం ఫ్రై, బగారా రైస్ మటన్ కర్రీ.. ఇలా తెలంగాణ ట్రెడిషనల్ డిష్‌లను ఈ తరానికి పరిచయం చేస్తున్నాను. బిజినెస్‌లో సక్సెస్ కావడమే కాదు తెలంగాణ టేస్ట్నీ పాపులర్ చేయడమే నా లక్ష్యం.

ఆ రియాలిటీ షోలో నా మోటో ఒక్కటే. ఫైనల్‌కు దక్షిణాది నుంచి ఎంపికైంది నేనొక్కదాన్నే. దాంట్లో ఏ డిష్ ఇచ్చినా, ఏ ఇంగ్రీడియెంట్స్ ఇచ్చినా ఇక్కడ తినే ఫుడ్, చట్నీ, సాంబార్, రసం, కర్రీ ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఒకసారి నారింజ పళ్లు ఇచ్చారు. తెలంగాణలో పచ్చి పులుసు ఫేమస్. చింతపండు బదులు ఆరెంజ్ జ్యూస్ వాడి పచ్చి పులుసు చేశాను. సాంబార్ చేయాల్సి వచ్చినప్పుడు సాంబార్ స్టాక్ (లిక్విడ్)ని వేరు చేసి, క్రీమ్ (బట్టర్) సమపాళ్లలో కలుపుకొన్న తర్వాత హైడ్రోజన్ గన్‌లో చార్జ్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి, తీసిన తర్వాత షేక్ చేస్తే ఫోమ్ వస్తుంది. ఈ ఫోమ్‌లో సాంబార్ టేస్ట్‌ని ఎంజాయ్ చేయొచ్చు.