జపాన్లో చెమట సమస్య లక్షలాది మంది జీవితాలను నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నది. ఇటీవల కాకెన్, హిసామిట్సు, మారుహో అనే మూడు ప్రముఖ ఔషధ సంస్థలు 15 నుంచి 59 ఏండ్ల వయస్సు గల 9,459 మందిపై జరిపిన ఆన్లైన్ సర్వేలో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సగం మంది (4,767 మంది) తమకు చెమట సమస్య ఉందనే విషయాన్ని ఒప్పుకొన్నారు. చెమట వల్ల కలిగే ఇబ్బందులు కేవలం శరీరానికే పరిమితం కాకుండా వారి ఆలోచనలను, రోజువారీ అలవాట్లను కూడా మార్చేస్తున్నాయట.
ఆందోళన వ్యక్తం చేసిన వారిలో 58 శాతం మంది చెమట భయంతో తమకు ఇష్టమైన పనులను వదులుకుంటున్నట్లు వెల్లడించారు. చెమట మరకలు పడతాయనే భయంతో నచ్చిన దుస్తులు వేసుకోవడం కూడా మానేశామని 27 శాతం మంది తెలిపారు. ఇతరులకు దగ్గరగా వెళ్లడానికి వెనుకాడేవారు 20 శాతం మంది ఉండగా, 16 శాతం మంది పగటిపూట బయటికి వెళ్లడం లేదా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడమే మానుకుంటున్నారు. చెమటను కేవలం ఒక శారీరక ప్రక్రియగా కాకుండా, సామాజిక అవమానంగా భావించే వైఖరి అకడ ఎకువగా కనిపిస్తున్నది.
సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది తమ చెమటను ‘అపరిశుభ్రమైనది’గా భావిస్తుండగా, 65 శాతం మంది తమ వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందేమోనని నిరంతరం భయపడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ పరిషారం వైపు అడుగులు పడటం లేదు. చెమట సమస్యతో బాధపడుతున్న వారిలో 69 శాతం మంది ఎలాంటి సహాయం కోరడానికి సిద్ధంగా లేరు. ఇది కేవలం ఒక శారీరక స్థితి మాత్రమే అని 19 శాతం మంది సరిపెట్టుకుంటే, దీనికి ఎలాగూ పరిషారం దొరకదనే నిరాశతో మరికొందరు (19 శాతం) మిన్నకుండిపోతున్నారు. మరోవైపు వైద్యులను సంప్రదించడానికి 48 శాతం మంది సంకోచిస్తున్నారు. దానికి ప్రధాన కారణం చికిత్సకు అయ్యే అధిక ఖర్చులేనని తేలడం విశేషం.