పిల్లలపై కన్నవాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ, తోబుట్టువుల ప్రభావం అంతకు తొమ్మిదిరెట్లు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బాగా చదివే అన్నయ్య ఉంటే.. చెల్లి, తమ్ముడు కూడా టాపర్స్‌గా నిలిచే ఆస్కారం ఎనభై శాతానికిపైగా ఉంటుందని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. ‘సిబ్లింగ్ ఎఫెక్ట్’ వల్లే ఇలా జరుగుతుందని మానసిక నిపుణుల విశ్లేషణ. తోబుట్టువుల మధ్య పెరిగేవారు పెద్దయ్యాక డిప్రెషన్‌లాంటి మానసిక జాడ్యాల బారినపడే ప్రమాదం తక్కువని చెబుతారు.
ఇద్దరు ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో అందరిలోకీ పెద్దబిడ్డకు ఉద్వేగ ప్రజ్ఞ ఎక్కువనీ, మిగిలినవారితో పోలిస్తే బాధ్యతగా ఉంటారని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం సుస్పష్టం. పెద్దకొడుకు, పెద్దకూతురు ..తమ తర్వాత పుట్టేవారి పెంపకంలోనూ బాధ్యత తీసుకుంటారు. దీంతో వయసుకు మించిన పెద్దరికం వచ్చేస్తుంది. ఇలాంటివాళ్లే భవిష్యత్తులో బాధ్యత కలిగిన కుటుంబ పెద్దలుగా, ప్రజా నాయకులుగా పేరు తెచ్చుకుంటారు. తోబుట్టువుల మధ్య పెరిగిన పిల్లల్లో పంచుకునే గుణమూ ఎక్కువని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ బృందం చెబుతున్నది. ‘ఎంతమంది పిల్లల్ని కనాలన్నది వారి వ్యక్తిగత విషయమే అయినా.. బిడ్డకు ఒక తోబుట్టువునైనా ఇవ్వడం కనీస బాధ్యత’ అంటారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టినా జోసెఫ్.