షార్క్ ట్యాంక్.. సోనీ లివ్లో టెలికాస్ట్ అవుతున్న ఓ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఐఐటీలు, ఐఐఎమ్ల పట్టభద్రులు ఆ వేదిక మీద బిజినెస్ ఐడియాలను పంచుకుంటారు. తమ ప్రణాళికలు వివరిస్తారు. అంకెల మంత్రమేసి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తారు. పబీబెన్లాంటి మహిళలు అక్కడి దాకా రావడం అరుదు.
పబీబెన్.. నిరక్షరాస్యురాలు. గుజరాత్, కచ్ ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెలో పుట్టింది. పేదరికం మధ్య పెరిగింది. పశువులు మేపేందుకు వెళ్లేది. వెళ్తూ వెళ్తూ కాలక్షేపానికి ఎంబ్రాయిడరీ సామగ్రి తీసుకెళ్లేది. బట్టల మీదే కాదు, అలంకరణ వస్తువుల మీదా ముచ్చటగా ఎంబ్రాయిడరీ చేయగలదు తను. నీలేశ్ థాపర్ అనే వ్యాపారవేత్తకు పబీబెన్ పనితనం గురించి తెలిసింది. తనే చొరవ తీసుకుని ఆమెతో ఓ కంపెనీ పెట్టించాడు. ఇప్పుడు ఆ సంస్థలో యాభైమంది ఎంబ్రాయిడరీ నిపుణులు ఉన్నారు.
షార్క్ ట్యాంక్ వేదికపై.. పబీబెన్ ఆలోచనలు నచ్చి యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఓ ఇన్వెస్టర్. ప్రస్తుతం పబీబెన్.కామ్ వార్షిక టర్నోవర్ రూ. రెండు కోట్లు. ‘సిగ్గు పడకండి. మొహమాటం వద్దు. భయపడొద్దు. మీ కలల్ని నిజం చేసుకోండి’ అని తోటి మహిళలకు సలహా ఇస్తారు పబీబెన్.