మన హితం కోరేవారే స్నేహితులంటారు. అలాంటి వారినే మన నేస్తాలుగా ఎంచుకుంటాం. కానీ, కొన్నిసార్లు తమ స్వార్థం కోసం మాత్రమే మనతో ఉండేవారిని సైతం మిత్రులుగా మార్చుకుంటాం. ఈ ఫేక్ ఫ్రెండ్స్ మన మానసిక శక్తికి, ప్రశాంతతకు భంగం కలిగించడమే కాకుండా మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు అందరికంటే ముందే మాయమైపోతారు. మీ బ్యాచ్‌లోనూ ఇలాంటివాళ్లు ఉంటే వారి నుంచి మీ మానసిక ప్రశాంతతను కాపాడుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి.
పరిమితులను నిర్ణయించుకోండి: ఫేక్ ఫ్రెండ్స్ తరచుగా మీ మంచితనాన్ని తమ స్వార్థానికి వాడుకుంటారు. వారికి ఏదైనా సాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేస్తారు. ఆ టైంలో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీ నుంచి సాయాన్ని ఆశిస్తూ, మీకేదైనా అవసరమైతే మాత్రం వంకలు చెబితే, వారి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండటం మానేయండి. మీరు వారికి కాస్త దూరం పాటిస్తున్నారని అర్థం చేసుకున్ననాడు.. వాళ్లూ మీ జోలికి రాకుండా ఉంటారు.
పర్సనల్స్ చెప్పొద్దు: మీ పర్సనల్ విషయాల్ని ఇతరులకు చెబుతూ మీపైనే వాటిని అస్ర్తాలుగా ప్రయోగించడంలో ఈ నకిలీ దోస్తులు దిట్ట. అందుకే మీ భావోద్వేగాలు, భవిష్యత్తు ప్రణాళికలు, మీ వ్యక్తిగత సమస్యల గురించి వారితో మాట్లాడటం పూర్తిగా ఆపేయండి. మీ మాటలను కేవలం పైపైన జనరల్ విషయాలకే పరిమితం చేయండి.
వాదన అసలొద్దు: ఫేక్ ఫ్రెండ్స్ మిమ్మల్ని తకువ చేసి చూపించాలని.. పరోక్షంగా కామెంట్లు చేస్తుంటారు. మీ విజయాలను చూసి పైకి నకిలీ ఆనందాన్ని నటిస్తుంటారు. అలాంటి వారితో వాదించి మీ శక్తినంతా వృథా చేసుకోకండి. వారిని ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి.
దూరం పెట్టండి: ఇది కాస్త కష్టమే అయినా ముఖ్యమైన అడుగు. ఉపకారికి అపకారం తలపెట్టే నైజం ఉన్న దోస్తులను అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. వారిపై వ్యక్తిగత భావోద్వేగాల్ని పెంచుకోకండి. వారు మారుతారనో, ఎప్పటికైనా సాయం చేస్తారనో ఆశించడం మానేయండి. వారిని మీ జీవితంలో ముఖ్యమైన పాత్రగా చూడటం మానేసి, కేవలం పరిచయస్తులుగానే భావించండి. ఆ స్నేహం మరీ విషపూరితంగా మారినట్లయితే, ఎలాంటి గొడవలు లేకుండా సైలెంట్‌గా ఆ బంధాన్ని అక్కడితో ఆపేయండి.
వారితో గడపండి: చాలాసార్లు మనం ఫేక్ ఫ్రెండ్స్ మాయలో పడి, నిజమైన నేస్తాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. మీ కష్టసుఖాల్లో తోడుండే నిజమైన స్నేహితులకు మీ సమయాన్ని, ప్రాధాన్యాన్ని ఇవ్వండి. కొత్త వ్యక్తుల్ని కలవండి. ఆరోగ్యకరమైన బంధాలను ఏర్పరచుకోండి.