‘ఉన్నది ఉన్నట్టు, ఉండదు కనికట్టు’ అనే మాట అప్పుడప్పుడూ వినేదే. ఇప్పుడు అదో ట్రెండ్! వార్తల్లో కాదు డేటింగ్లో! పెండ్లికి ముందు భాగస్వామిని అర్థం చేసుకోవడానికి కొందరు డేటింగ్ చేస్తారు. ఈ డేటింగ్లో అవతలి వాళ్లు అర్థం కాకపోతే… ఆ తర్వాత జీవితాల్లో సమస్యలే. అలాంటి చికాకులు రాకుండా ఉండాలని కొత్త జంటలు ‘గోబ్లింటిమసీ’ని ఫాలో అవుతున్నాయట. డేటింగ్లో ఉన్నపుడు పాజిటివ్ విషయాలు ఒకరికొకరు పంచుకోవడం తెలిసిందే. లోపాలు లేని మనిషి ఉంటాడా? కానీ, డేటింగ్ రోజుల్లో ఆ లోపాలేవీ బయటపడవు. అవతలి వాళ్లు కలిసి ఉండేందుకు సందేహిస్తారు అనుకున్న విషయాలు తెలివిగా దాచేస్తారు. ఆ కొద్దికాలం నటిస్తారు. మంచివాళ్లు అనిపించుకునే ప్రయత్నం చేయకపోయినా అవతలి వాళ్లను నొప్పించకుండా వ్యవహరిస్తారు.
ఆ తర్వాత కాలంలో అవి బయటపడ్డప్పుడు భాగస్వామికి నచ్చవచ్చు. కొన్ని నచ్చకపోవచ్చు. ఇద్దరి మధ్య ఉన్న బంధం బీటలు వారొచ్చు. అందుకే తమ దురలవాట్లను, గతంలోని తప్పులు కూడా నేటి తరం ముందే డేటింగ్ పార్ట్నర్ ముందుంచుతున్నది. ఇలా చెప్పుకోవడమే గోబ్లింటిమసీ. లోపాలను చెప్పుకొంటే బంధం బలపడదని భయపడతారు. కానీ నిజం నిప్పులాంటిది. దానిని ఎక్కువ కాలం దాచలేం. డేటింగ్ నుంచి పెళ్లి దాకా పోయిన తర్వాత ఆ నిజాలు తెలిస్తే ఇద్దరే కాదు ఇరు కుటుంబాలకూ సమస్యలే. కాబట్టి గత కాలపు తప్పులే కాదు మనసులోని ప్రతికూలమైన ఆలోచనలూ ముందు చెప్పుకోవాలని నేటి యువత భావిస్తున్నారు. ఇలా చెప్పుకోవడంలో ఉద్దేశం అవతలి వాళ్లను వాటికి అంగీకరించమని కాదు. కానీ, కలిసి జీవించడానికి కనీసం సర్దుబాటు చేసుకుని ఉండగలరో, లేదో తెలుసుకోవడానికి! సర్దుకుపోతే సంసార జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. ‘అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మిన్న’ అని పెద్దలు అన్న మాటను ‘గోబ్లింటిమసీ’ ట్రెండ్ గుర్తు చేస్తున్నది.