ఎమ్‌వై3 (మైత్రి)
డిస్నీ+హాట్‌స్టార్: సెప్టెంబర్ 15
తారాగణం: హన్సిక, మ్యుగేన్ రావు, శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్
దర్శకత్వం: ఎం.రాజేశ్
‘దేశముదురు’తో తెలుగు ప్రేక్షకులను ‘నిన్నే నిన్నే…’ అని అలరించిన హన్సిక అడపాదడపా మంచి విజయాలు అందుకుంది. గ్లామర్‌కు చిరునామాగా నిలిచిన ఈ నటి తొలిసారి ఓటీటీలోకి రంగప్రవేశం చేసింది. ఆమె రోబోగా నటించిన ‘ఎమ్‌వై3’ వెబ్‌సిరీస్‌కు మిశ్రమ స్పందన లభిస్తున్నది. తొమ్మిది ఎపిసోడ్లుగా నిర్మించిన ఈ సిరీస్ కథలోకి వెళ్తే.. ఆదిత్య (ముగెన్ రావు) కోటీశ్వరుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఒంటరిగా పెరుగుతాడు. అతడికి హ్యూమన్ ఎలర్జీ ఉంటుంది. అంటే మనుషులతో కలిస్తే శరీరంపై దద్దుర్లు వస్తుంటాయి. మరోవైపు శాస్త్రవేత్త అయిన ఇలియాస్ (శంతను భాగ్యరాజ్) ఎంవై3 రోబోను సృష్టిస్తాడు. దానిని అతని మాజీ ప్రేయసి మైత్రి (హన్సిక) రూపంలో తయారుచేస్తాడు. అది ఆదిత్య కంటపడుతుంది.
రోబోను మూడు నెలలపాటు తన ఇంట్లో ఉంచాలని ఒప్పందం చేసుకుంటాడు. అయితే, డెలివరీకి ముందు ఓ ప్రమాదంలో రోబో పాడవుతుంది. గత్యంతరం లేక తన మాజీ ప్రేయసి మైత్రిని రోబోకు బదులుగా ఆదిత్య ఇంటికి పంపిస్తాడు. మైత్రి రోబోగా నటిస్తుంటుంది. మైత్రిని నిజమైన రోబోగా భావిస్తాడు ఆదిత్య. తనపట్ల అది చూపిస్తున్న ఆదరణకు ముగ్ధుడై యంత్రంతో ప్రేమలోపడతాడు. రోబో పూర్తిగా తనకు ఇచ్చేయాలని ఇలియాస్‌ను కోరుతాడు. ఇలియాస్ ఎలా స్పందించాడు? మైత్రి ఒప్పుకొంటుందా? మైత్రి రోబో కాదని తెలిశాక ఆదిత్య ఏం చేశాడన్నది మిగిలిన కథ. అనుకున్నంత హాస్యం పండకపోయినా.. అక్కడక్కడా భావోద్వేగాలు పండుతాయి.
లెస్బియన్ల సహజీవనంలో ఎదురయ్యే సమస్యలే కథాంశంగా రూపొందించిన ‘అపార్’ షార్ట్ ఫిల్మ్ దేశంలో జరిగే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ చిత్రానికి అధికారిక ఎంట్రీ లభించింది. వారణాసి, దర్భంగా, బరేలీ నగరాల్లో దీనిని ప్రదర్శించారు. బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ‘క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 28వ కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది.
15 నిమిషాల నిడివి గల ఈ షార్ట్‌ఫిల్మ్‌కి అభిసోన్ దర్శకత్వం వహించాడు. కరీంనగర్‌కు చెందిన వారాల అన్వేష్ ఈ చిట్టి చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేశాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చదివిన అన్వేష్‌కి ఇస్రోలో ఉద్యోగం వచ్చింది. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తిచేసిన ఆయన ‘పట్నం’, ‘బతుకే ఒక కల’కు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేశాడు.