మా నాన్న నాలుగేండ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించారు. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇద్దరు అన్నయ్యలున్నారు. ఈ మధ్యే నాకు ఓ విషయం తెలిసింది. అమ్మ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని అన్నయ్య చెప్పాడు. త్వరలోనే అతణ్ని పెండ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉందట. ఆ మాట వినగానే కోపం వచ్చింది. ఏడ్చేశాను. అమ్మను నిలదీశాను.
నోటికొచ్చినట్టు తిట్టాను. అమ్మ మాత్రం ప్రశాంతంగా ‘ఇదంతా మీ కోసమే. మనింటికి ఓ మగదిక్కు అవసరం బిడ్డా’ అంటున్నది. ఎందుకో ఆ మాటలు నమ్మాలనిపించడం లేదు. అసలు ఆ ఇంట్లోనే ఉండాలని లేదు. నాన్న స్థానంలో మరొకర్ని ఊహించుకోలేక పోతున్నాను. అమ్మ మనసు మార్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్.
ఒక్కసారి మీ అమ్మ వైపు నుంచి ఆలోచించండి. ఏదో ఒక రోజు మీ అన్నయ్యలు పెండ్లి చేసుకుని వెళ్లిపోతారు. నువ్వు కూడా మనసిచ్చిన మనిషి వెంట ఏడడుగులు వేస్తావు. అప్పటికి అమ్మ వయసు నిండా యాభై ఏండ్లు కూడా ఉండవు. మిగిలిన కాలమంతా ఆమె ఒంటరిగా బతికేయాలా? తనకంటూ ఓ తోడు అవసరం లేదా? తనేం అక్రమ సంబంధం కోసం ఆరాటపడటం లేదు. తనకు నచ్చిన వ్యక్తిని భాగస్వామిగా జీవితంలోకి ఆహ్వానిస్తున్నది. అదేం పాపం కాదు, నేరమూ కాదు. ఇక సమాజం అంటారా? ఓ నాల్రోజులు మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. నవ్వుకుంటారు. ఆ తర్వాత గమ్మునుండిపోతారు. ఆ మాత్రం దానికి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మనే ద్వేషిస్తావా? ఆమె నిర్ణయానికి మద్దతు ఇవ్వడం మంచిది.