‘గుడ్ మార్నింగ్ హైదరాబాద్’ అంటూ ఉదయాన్నే నగరవాసుల్ని తన పాటలతో నిద్ర లేపింది. ‘గుడ్ మార్నింగ్ బిగ్‌బాస్’ అంటూ 99 రోజులపాటు బిగ్‌బాస్ హౌజ్‌ను ఉర్రూతలూగించింది. తను ఎక్కడుంటే అక్కడ సందడే. రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, యాంకర్, యూట్యూబర్.. ఇప్పుడు నటిగా రహీమున్నీసా మెహ్సబీనా.. అలియాస్ ఆర్జే కాజల్ ప్రయాణం వైవిధ్య భరితం. ఇటీవల విడుదలైన తన వెబ్‌సిరీస్ గురించీ, కుటుంబం గురించీ ఎన్నో విషయాలు పంచుకున్నది కాజల్.
తెలుగు ప్రేక్షకులకు నమస్తే. బిగ్‌బాస్‌తో మొదలైన మా ఎస్ఎమ్కే (సన్నీ- మానస్- కాజల్) బంధం మరింత బలపడింది. హౌజ్ నుంచి బయటికొచ్చాక కూడా చాలాసార్లు కలుసుకున్నాం. వీకెండ్ టూర్స్ ప్లాన్ చేసుకున్నాం. కానీ అన్నిసార్లూ కుదరలేదు. అయితేనేం, ‘ఎస్ఎమ్కే ఫరెవర్’ గ్రూప్‌లో ప్రతీది షేర్ చేసుకుంటాం. నా రీల్స్‌కు కామెంట్స్, ర్యాగింగ్.. అబ్బో.. చాలానే ఉన్నాయి. మా ముగ్గుర్నీ కలిపి సినిమా తీయాలని ఓ డైరెక్టర్ వచ్చారు. కథ నచ్చింది కానీ.. సన్నీ, మానస్‌కు షెడ్యూల్ కుదరలేదు. అన్నీ అనుకూలిస్తే.. ముగ్గురం కలిసి బిగ్‌స్క్రీన్ మీద అలరిస్తాం. ఆర్జేయింగ్ చేస్తున్నప్పటి నుంచీ సినిమాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్ చెబుతూనే ఉన్నాను. సీరియల్స్‌తో పోలిస్తే సినిమాలే ఎక్కువ. ఎంతోమంది హీరోయిన్లకు నా గొంతు అందిస్తున్నాను. ఓటీటీ మూవీస్‌కు కూడా డబ్బింగ్ చెబుతున్నాను. ఇప్పటివరకు దాదాపు 98 సినిమాలకు, ఏడెనిమిది సీరియల్స్‌కు పనిచేశాను. ఇక్కడో సమస్య ఉంది. సీరియల్స్‌కు రోజూ డబ్బింగ్ చెప్పాలి. కానీ, బిజీ షెడ్యూల్ వల్ల ఒక్కోసారి కష్టం అవుతుంది. అయినా నెట్టు కొస్తున్నా. భవిష్యత్‌లో ఈ జోడుగుర్రాల సవారీ కుదరక పోవచ్చు.
ఇష్టంతోనే..
నేను చిన్నప్పటి నుంచీ సరదా మనిషిని. సినిమాలు, పాటలు, ఆటలు.. ఇవే నా ప్రపంచం. స్కూల్, కాలేజ్ డేస్‌లో ఎన్నో బహుమతులు వచ్చాయి. ఇంట్లోవాళ్లు కూడా చాలా ప్రోత్సహించారు. ఆ ఇష్టమే నన్ను ఆర్జేయింగ్ వైపు తీసుకొచ్చింది. ఈవెంట్స్ చేశాను, హోస్ట్‌గా వ్యవహరించాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ట్గా గొంతు వినిపించాను. వివిధ షోలలో కనిపించాను. ఇంకా, యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నా. వ్లాగర్గానూ కనిపిస్తున్నా. అయితే బిగ్‌బాస్ నాకు అతిపెద్ద వేదికను పరిచయం చేసింది. కోట్లాది మందికి చేరువ చేసింది. పది హేనేండ్ల క్రితం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. రొటీన్ ఉద్యోగాన్ని కాదనుకుని.. ఆర్జేయింగ్ వైపు అడుగులేశాను. మొదట్లో నా షో కొంత కొత్తగా ఉండేందుకు స్వామి వివేకానందుడి సూక్తులు చెబుతూ.. సజీవ ఉదాహరణలు జోడించేదాన్ని. ఆ సూక్తులు విని.. ఆత్మహత్య ఆలోచన మానుకున్న వాళ్లూ ఉన్నారు.
సినిమాల వైపు
సినిమాలంటే నాకు ఇష్టం. అందుకే నటనలో ఇంత బిజీగా ఉన్నా. ఏ రంగంలో ఉన్నా సరే, మన కెరీర్‌ను మనం డిజైన్ చేసుకోవాలనేది నా సూత్రం. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాల్సి ఉంటుంది. కాబట్టే, హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని నేనెప్పుడూ పట్టుబట్టి కూర్చోలేదు. వచ్చిన అవకాశాల్లో ఏది మంచిదో బేరీజు వేసుకుని.. యాక్టింగ్ వైపు అడుగులు వేస్తున్నాను. ఇప్పుడు సినిమాలతోపాటు ఓటీటీ అవకాశాలూ వస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఎక్స్పోజ్డ్’ అనే వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. మీడియా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది కథంతా. అందులో నేను ఓ న్యూస్ చానల్‌కు చీఫ్ ఎడిటర్ పాత్ర పోషిస్తున్నాను. కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. అయినా నాకు నచ్చింది. ఆ సిరీస్‌లో నా పాత్ర చాలా కీలకం. ఎపిసోడ్స్ వస్తున్నకొద్దీ.. మరింత రక్తికడుతుంది. ‘ఎక్స్పోజ్డ్’తో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే కోరిక తీరింది. ఇక మిగిలింది సినిమాలు. ఓ మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్నా.
ప్రేమ కోసం..
(నవ్వుతూ..) షబ్బూ నా నిక్‌నేమ్. నేను హైదరాబాద్ వచ్చిందే ప్రేమకోసం. ఇంట్లోవాళ్లు నా ప్రేమను కాదన్నందుకు రక్తం మరిగిపోయింది. విజయ్ కోసం పారిపోయి వచ్చాను. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. క్రమంగా బతకడం నేర్చుకున్నాను. ఓ బిడ్డ పుట్టిన తర్వాతే అమ్మానాన్నల ప్రేమలోని గాఢత మరింత అర్థమైంది. మా అమ్మాయి అచ్చం తండ్రి పోలికే. విజయ్ కూడా బయట చాలా సైలెంట్‌గా ఉంటారు. మా చిన్నారి కోసం సొంతంగా ‘హైబ్రీడ్ పిల్ల’ అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాం. తనకిప్పుడు 11 ఏండ్లు. ఆరో తరగతి. వాద్య సంగీతం అంటే ఇష్టం. వంట నేర్చుకుంటున్నది. తను కూడా నాలాగే.. ‘ఒక్కసారి డిసైడ్ అయితే, వార్ వన్‌సైడే’.