Mass Look | మన హీరోలు మారిపోతున్నారండీ! మాటల్లో పంచ్‌లు.. మాస్ ఫైటింగ్‌లు షరా మామూలే అయినా.. చమ్కీల అంగీలేసి తెరమీదికొస్తున్నారు. దుమ్ముకొట్టుకుపోయిన ఆహార్యంతో బాక్సాఫీస్ దంగల్‌కు సిద్ధమవుతున్నారు. రా లుక్‌తో రచ్చ చేస్తున్నారు. ఇండస్ట్రీకి నయా కిక్ ఇస్తున్నారు. మునుపెన్నడూ ప్రయత్నించని రూపంతో అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు.
అప్పుడెప్పుడో ‘రాజు-పేద’లో ఎన్టీఆర్ డీగ్లామర్ పాత్ర పోషిస్తే.. దశాబ్దాలపాటు చెప్పుకొన్నారు. ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్‌హాసన్ కూడా తరచూ డీ గ్లామర్ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి తన ప్రతిష్ఠను పెంచుకున్నవాడే! మంచి నటుడు అనిపించుకోవాలంటే అయితే డీ గ్లామర్ పాత్రలు, లేదంటే ఊర మాస్ రోల్స్‌లో కనిపించడమే మార్గంగా భావించేవాళ్లు. మాస్ చిత్రాలకు కొదవేం లేదు కానీ, డీ గ్లామర్ పాత్రల జోలికి వెళ్లడానికి అందరు నటులూ సాహసించేవాళ్లు కాదు. కథలో కొత్తదనం, కథనంలో వేగం కోరుకుంటున్న ఈ తరం అభిమాన గణాన్ని ఆకర్షించడానికి సినిమా ప్రకృతికి భిన్నంగా రా లుక్‌తో కనిపించే పాత్రలను ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు కథానాయకులు. విక్రమ్ ‘శివపుత్రుడు’, సూర్య ‘గజిని’ ఈ కోవకు చెందినవే! ఈ ట్రెండ్‌ను కాస్త పక్కన పెట్టిన సినీజనం ఇప్పుడు మళ్లీ తమ హీరోలను విభిన్నంగా చూపించడానికి ఆ తరహా పాత్రలను సృష్టిస్తున్నారు.
మొన్నటికి మొన్న చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్’ మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో విక్రమ్ రా లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రయోగాలకు పెట్టింది పేరైన విక్రమ్‌కు ఇలాంటి పాత్ర దొరికితే ఇంకేముంది! ఆహార్యాన్ని మాత్రమే కాదు.. ఆపాదమస్తకం పాత్రోచితంగా మలుచుకోగలడు. కొల్లాయి గట్టి, కత్తులు పట్టి, జుట్టును ముడికట్టి వింతరూపంతో విస్తుగొలిపేలా కనిపిస్తున్న విక్రమ్‌తో దర్శకుడు ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తాడో అని అభిమానులు ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు.
ప్రయోగాల చిత్రాలు, రా లుక్ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కావని చాలామంది నమ్మకం. అందుకే వీలైనంత వరకు హీరోను మాస్ మహారాజాగా ప్రమోట్ చేస్తారే కానీ, లుక్కు మార్చేసేంత నాటు మాస్ పంథాను ఎంచుకోరు. కానీ, ఇటీవల ఈ ధోరణికి మంగళం పాడుతూ కమర్షియల్ ఫార్ములాలో ఇమిడేలా హీరో క్యారెక్టర్‌ను రా లుక్‌తో రాటుదేలుస్తున్నారు దర్శకులు. సుకుమార్
దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో హీరో చిట్టిబాబు పాత్ర అలా డిజైన్ చేసిందే! మొండిఘటంగా పేరున్న చిట్టిబాబును మొరటుగా చూపించి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశాడు దర్శకుడు. హీరోకు వినికిడి లోపాన్ని పెట్టడమూ సాహసమే! చిట్టిబాబు పాత్ర స్ఫూర్తితోనే తర్వాత తెరకెక్కించిన ‘పుష్ప’లో హీరో పాత్రను మరింత ఘాటుగా డిజైన్ చేశాడేమో సుకుమార్. భుజానికి లోపం పెడుతూనే సినిమా భారమంతా ఆ భుజస్కంధాలపై మోపాడు. సినిమా నిర్మాణ సమయంలో టీమ్ అంచనాల సంగతి ఏమో కానీ, రిలీజయ్యాక అల్లు అర్జున్ రా లుక్కు పాన్ ఇండియా ఫిదా అయింది. ఆ నడకను అనుకరించింది. ఆ లోపాన్నీ అనుసరించింది. స్టెప్పులను ప్రపంచమంతా వైరల్ చేసింది. పుష్ప-2లో అల్లు అర్జున్ లుక్‌ను టీమ్ ఇటీవల విడుదల చేసింది. చీరకట్టులో, భారీ మేకప్‌తో ముస్తాబైన పుష్పను చూసి స్టయిలిష్ స్టార్ అభిమానులంతా పండుగ చేసుకున్నారు. విడుదల తేదీపై స్పష్టత కరువైనా.. అప్పటివరకు ఈ లుక్ ఎంజాయ్ చేస్తామంటూ ట్వీట్లు చేస్తున్నారు.
హీరో అంటే ఒకప్పటి నవలల్లో కథానాయకుడిలా పెద్దకారులో రావాలి, సూటూబూటూ వేసుకోవాలి, చలువ కండ్లద్దాలు పెట్టుకోవాలి, ఒంటిచేత్తో కారు స్టీరింగ్ తిప్పుతూ, మరో చేతి వేళ్లలో సిగరెట్ స్టయిల్‌గా పట్టుకోవాలి.. ఇవన్నీ ఒకప్పటి ఫార్ములాలు. ఇప్పుడు హీరో ఎలాగైనా ఉండొచ్చు. ఎలాంటి దుస్తులైనా కట్టుకోవచ్చు. చింపిరి జుట్టుతో కనిపించొచ్చు. ఒళ్లంతా దుమ్మూధూళి కొట్టుకుపోయి ఉండొచ్చు! ఇదీ నేటి దర్శకులు పాటిస్తున్న సూత్రం. అందుకు తగ్గట్టుగానే కథలు సిద్ధం చేస్తున్నారు. హీరోలను ఒప్పిస్తున్నారు. నాటు లుక్‌తో నీటుగా హిట్లు కొడుతున్నారు. మొన్నీమధ్య విడుదలైన ‘దసరా’ సినిమాలో నాని లుక్ అదిరిపోయింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నాని మాస్ అవతారం ఎత్తితే ఈ రేంజ్లో ఉంటాడని అభిమానులూ ఊగిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ను రా లుక్‌తో చూపించి హైప్ పెంచాడు జక్కన్న.
కన్నడ చిత్రం ‘కాంతార’ ఈ తరహా ఫార్ములా చిత్రమే! కథలో భాగమే అయినా కథానాయకుడి పాత్రను ఊర మాస్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు, హీరో రిషభ్ శెట్టి. మాస్ లుక్‌ను మరింత పెంచడానికి ఎడ్లతో నిర్వహించే కంబళ పోటీని వేదికగా చేసుకున్నాడు. మట్టిపరిమళాలు అద్దుకున్న కథకు దైవత్వాన్ని జోడించడంతో మాస్ సినిమాగా వచ్చి మాస్టర్ పీస్‌గా నిలిచిపోయింది కాంతార. భూతకోల ఆచారాన్ని చూపించిన తీరు, పంజుర్లిగా రిషభ్ నటన ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపించింది.