‘ఆ పిల్లలు ప్రత్యేకం. మిగిలినవారితో పోల్చకండి. ఆ పిల్లలు ఆణిముత్యాలు. ఇష్టమైన రంగంలో సానబెట్టండి. ఆ పిల్లలు బంగారాలు. చిన్నచూపు చూడకండి’ అని పిలుపునిస్తున్నారు ‘మార్గిక’ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీనా రావు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రత్యేక విద్యావసతులు, శిక్షణ అవసరమని అంటున్నారు నీనా.
నాకు ఒక్కడే కొడుకు. చిన్నప్పుడు కథలు ఆసక్తిగా వినేవాడు. పుస్తకాలూ చదివేవాడు. ఒక రోజు వాళ్ల నాయనమ్మ రామాయణం చెబుతున్నది. ఆ కథ వింటూ మధ్యలో.. ‘సీత కోసం రాముడు లంకపై దండెత్తడం దేనికి? రావణుడితో యుద్ధం చేయకుండా గాంధీలా అహింసా పద్ధతిలో పోరాటం చేయొచ్చు కదా? అహింస గొప్పది. గొప్పవాడైన రాముడెందుకు అహింస ఆయుధంగా తలపడలేదు?’ అని అడిగాడు. పిల్లల ఆలోచన ఎంత పదునుగా ఉంటుందో చెప్పడమే నా ఉద్దేశం.
బాగా చదివేవాడు కానీ..
పిల్లల్లో శారీరక సమస్య ఉంటే తెలుస్తుంది. వెంటనే, డాక్టర్ దగ్గరికి తీసుకుపోతాం. కానీ ఆటిజం, ఏడీ
హెచ్డీ, డిస్లెక్సియా వంటి మానసిక ఎదుగుదల లోపాలను ఓ పట్టాన గుర్తించలేం. చిన్నప్పుడు సాధారణంగానే కనిపిస్తారు. ప్రవర్తన అసాధారణంగా ఉంటుంది. మావాడు తెలివిగా మాట్లాడేవాడు. దీంతో, మాకు అనుమానం రాలేదు. కానీ, క్లాస్ రూమ్‌లో పిల్లలతో గొడవలు పెట్టుకునేవాడు. దీనికి కారణం ‘పెర్వసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్’ అని తెలిసింది. అప్పుడే పిల్లల మానసిక సమస్యల గురించి లోతుగా తెలుసుకోవాలి అనిపించింది. మెదడు ఎదుగుదల, నాడీ వ్యవస్థ పనితీరు ఆధారంగా పిల్లలు స్పందిస్తారు. ఆ నిర్మాణాల్లో సమస్యలు ఉంటే స్పందన మందకొడిగా ఉంటుంది. స్కిజోఫ్రీనియా, బైపోలార్, యాంగ్జయిటీ డిజార్డర్, డిప్రెషన్ లాంటి సమస్యలన్నీ ఇలా వచ్చేవే. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని డెవలప్మెంట్ డిజార్డర్స్ కేటగిరిలో చేర్చింది.
ఒక్కటే బడి
గుర్వింద్ కౌర్ అనే మహిళ ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం సికింద్రాబాద్‌లో ఒక పాఠశాల నడిపేది. యాభై మంది విద్యార్థులు ఉండేవారు. ఆమె డబ్బు మనిషి కాదు. విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం తగినంత స్థలం, భవన సముదాయం లేకపోవడంతో ఆ రిసోర్స్ సెంటర్‌ను మూసేసింది. దీంతో, బాబు చదువులకోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో అడ్మిషన్ దొరికింది. అక్కడ తను హాయిగా చదువుకునేవాడు. దీంతో మాకూ సంతోషంగా గడచిపోయింది. పన్నెండో తరగతి డిస్టింక్షన్లో పాసయ్యాడు. నేను హైదరాబాద్‌లో కెరీర్ మొదలు పెట్టక ముందు అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి వచ్చాను. కాబట్టే, నా కొడుకు కోసం అంతదూరం వెళ్లగలిగాను. చదివించగలిగాను. మరి పేదల సంగతి? అమెరికాలో ఉన్నన్ని ఏర్పాట్లు మన దగ్గర లేవు. అందుకే, మా అబ్బాయి లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం పని చేయడం మొదలుపెట్టాను. మొదట చాలా స్కూళ్లు తిరిగాను. వాళ్లకు మార్కులు, ర్యాంకులు రావాలి. లాభాలు కావాలి. అంతేకానీ, పిల్లల గురించి పట్టించుకోరు. దీంతో స్నేహితుల సహకారంతో మూడు పాఠశాలల్లో ట్రైనింగ్ ఆరంభించాను. తర్వాత టెక్ మహీంద్రా ఫౌండేషన్‌తో కలిసి అయిదు విద్యాసంస్థల్లో శిక్షణ ఇచ్చాను.
తెలంగాణ విద్యాశాఖ సహకారంతో లెర్నింగ్ డిజెబిలిటీస్ ఉన్న పిల్లల్ని గుర్తించడానికి పైలట్ ప్రాజెక్ట్‌గా రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా), ఎల్కతుర్తి (హనుమకొండ జిల్లా) మండలాలను ఎంచుకున్నాం.
‘టాలెంట్’షో కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులను సాధారణ విద్యార్థులే అర్థం చేసుకోలేక పోయారు. దీంతో ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం వేరుగా ఆన్లైన్ కార్యక్రమాలు చేపట్టాం. లాక్డౌన్ తర్వాత ప్రత్యేక అవసరాలున్న పిల్లల పెంపకం, విద్యపట్ల తల్లిదండ్రులు, టీచర్లకు అవగాహన కల్పించే పని మళ్లీ మొదలుపెట్టాం. 2017లో ప్రారంభమైన ‘మార్గిక’ కార్యకలాపాలు మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం రాష్ట్రాలకూ విస్తరించాయి. మా నెట్ వర్క్‌లో ఎనిమిది వేల మంది పిల్లలున్నారు. వాళ్ల కోసం ఈ మధ్యనే ఒక వర్చువల్ టాలెంట్ షో నిర్వహించాం. మూడు వందల మంది పాల్గొన్నారు. వాళ్ల చిత్రాలు చూస్తుంటే, వాళ్ల కథలు చదువుతుంటే, వాళ్ల ఊహలు తెలుసుకుంటూ ఉంటే ముచ్చటేస్తుంది. ‘మైండ్స్కేప్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకంలో అసాధారణ పిల్లల ప్రతిభను చూసి దలైలామా, ఆమిర్‌ఖాన్, శాంతా సిన్హా ప్రశంసా సందేశాలు పంపారు.
సంతోషంగా నేర్పిద్దాం
ఆటిజం పిల్లలు పెద్దగా మాట్లాడరు. పదాలు పలికే సామర్థ్యం తక్కువ. దీంతో సమాజం పిచ్చివాళ్లుగా ముద్రవేస్తుంది. అది అబద్ధ్దం. వాళ్లకూ తెలివి ఉంటుంది. ఐన్‌స్టీన్, న్యూటన్, బిల్‌గేట్స్ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లే. అయితేనేం, తమవైన రంగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఏదైనా ఒక అంశం పట్ల చాలా ఉత్సాహం చూపుతారు. చిత్రకళలో విన్సెంట్ వాంగో, సంగీతంలో వాన్ బితోవెన్ ఎంత సుప్రసిద్ధులో చరిత్రే చెబుతున్నది. అందుకే, చింతిస్తూ కూర్చోవడం మానేసి.. వాళ్లలోని ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేద్దాం.
ఊహల ఊయల
మేఘనకు అమ్మ ఉంది. కానీ, నాన్న లేడు. సంచార జీవితం గడిపే సామాజిక వర్గానికి చెందిన ఆ చిన్నారి గీసిన చిత్రంలో శిశువే కాదు అమ్మ కూడా ఊయల ఊగుతున్నది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రోత్సహిస్తే గొప్పగా ఆలోచిస్తారనడానికి ఇదో ఉదాహరణ.
– నాగవర్ధన్ రాయల