కవితా చావ్లా సాధారణ గృహిణి. చదివింది ఇంటర్మీడియెట్. కానీ నిత్య జిజ్ఞాసి. ఉత్తమ ఇల్లాలిగా, మంచి అమ్మగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే పనిలో పనిగా ప్రపంచాన్నీ చదివారు. ఆ కృషి ఫలితంగానే ‘కౌన్బనేగా కరోడ్పతి సీజన్-14’లో కోటి రూపాయలు గెలుచుకున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ కవిత సొంతూరు. ‘నా కల నిజమైంది. ఈ షో కోసం ఎలాంటి పుస్తకాలూ చదవలేదు. నా పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడే ముఖ్యమైన విషయాలు రాసి పెట్టుకునేదాన్ని. ఇరవై ఏండ్ల నుంచీ క్రమం తప్పకుండా అమితాబ్ సర్ షో ఫాలో అవుతున్నా. ఈ కార్యక్రమంలో కోటి రూపాయలు గెలవడం అన్నది కేక్ మీద చెర్రీ లాంటిది. నిజానికి డబ్బు పట్ల ఆశతో ఇంతదూరం రాలేదు. నా తపన గౌరవం, గుర్తింపు కోసమే. ఈ ప్రయాణంలో కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు కవిత. ‘ఈ డబ్బుతో నా కొడుకును విదేశాలకు పంపి పెద్ద చదువులు చదివిస్తాను. అదే నా తొలి ప్రాధాన్యం’ అంటూ అమ్మ మనసు చాటుకున్నారు.