‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో తెలుగింట అడుగుపెట్టిన ‘చందమామ’ కాజల్. మిత్రవిందగా ‘మగధీర’ను మెప్పించడమే కాదు తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. వరుస సినిమాలతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా నిలిచింది. అగ్ర కథానాయకుల సరసన దీటుగా నటించి మెప్పించింది. పెండ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చింది. ఐదు నెలల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. మళ్లీ వెండితెరపై కనిపించనుంది. ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా అన్నీ భారీ ప్రాజెక్టులే.
ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. నా కెరీర్లోనూ అంతే! అయితే, ఈ ఎగుడుదిగుళ్ల ప్రయాణం ఎన్నో విషయాలు నేర్పింది. గెలుపు, ఓటముల సంగతి అటుంచితే, నా జర్నీ ఎన్నో అనుభవాలను పంచింది. కాస్త విరామం తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. చాలా ఉత్సుకతతో ఉన్నాను. యాభైకి పైగా సినిమాల్లో నటించినా, మళ్లీ మొదటి సినిమా చేస్తున్న అనుభూతి కలుగుతున్నది. కొత్త తరహా పాత్రలు పోషించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నటిగా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతుంటాను.
ప్రస్తుతం మావాడికి ఐదు నెలలే. వాడితో గడపడానికి సమయం సరిపోవడం లేదు. సినిమాల్లోకి రీఎంట్రీ తర్వాత కూడా అబ్బాయికి ఇబ్బంది రాకుండా టైమ్ సెట్ చేసుకుంటాను. నేను అందుబాటులో లేనప్పుడు మా అమ్మ చూసుకుంటుంది.
ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించాల్సిందే. అప్పుడు ఎలాంటి సమస్యలూ రావు. ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినను. అలాగని కడుపు కట్టుకొని కూర్చోను. ఏదైనా మితంగా తీసుకుంటాను. నా ప్రొఫెషన్‌కు అది అవసరం కూడా! కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, ఫైబర్ ఇలా అన్నీ సమపాళ్లలో ఉండే ఆహారం తీసుకుంటాను. వ్యాయామాన్ని బట్టి కూడా డైట్ మారుతుంది.
కథానాయికగా దక్షిణాది చిత్రాలతో నా కెరీర్ మొదలైంది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలు నా పుట్టిల్లు లాంటివి. నటిగా రాటుదేలిందీ అక్కడే. దక్షిణాది సంప్రదాయాలు, సంస్కృతి నా మనసుకు ఎంతగానో దగ్గరయ్యాయి. అంతేకాదు, ఆ ప్రేక్షకులు కూడా నన్ను ఎంతగానో ఆదరించారు. వారినీ నేను ఎంతో అర్థం చేసుకోగలిగాను. అవన్నీ నా జ్ఞాపకాల్లో కలకాలం చెదరకుండా ఉండిపోతాయి.
హిందీ నా మాతృభాష. నేను పుట్టింది, పెరిగింది ముంబైలోనే! హిందీ సినిమాలు చూస్తూనే పెరిగాను. అయితే, నటులకు, నటనకు భాషా భేదాలు ఉండవు. భాషలో వ్యక్తపరచలేని భావాలను సైతం హావభావాలతో పలికించొచ్చు కదా! అందుకే, నేను ఏ భాషా చిత్రాల్లో నటించినా ఇబ్బందిపడిన సందర్భాలు లేవు. ఇక తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. సృజనాత్మకత పరంగా, సాంకేతికత పరంగా అత్యున్నత స్థితికి చేరుకుంటున్నాయి.
మాతృత్వం మహిళకు ఒక వరం. ప్రస్తుతం అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నాను. మా అబ్బాయికి అన్నిట్లో బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఉత్సాహవంతమైన బాల్యంతోపాటు మంచి విద్య, ఉన్నతమైన విలువలు అందించాలని భావిస్తున్నాను. పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగిన నిజమైన బహుమతులు ఇవే. వీటి తర్వాతే మరేదైనా!
వర్కవుట్ల విషయానికి వస్తే బరువు తగ్గేవి, గుండె పనితీరు మెరుగుపర్చేవి ఎక్కువగా చేస్తుంటాను. లాక్డౌన్ సమయంలో వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. వర్చువల్ క్లాసెస్ ఫాలో అయ్యేదాన్ని. ప్రత్యేకమైన యోగాసనాలు, వర్కవుట్లు చేయడం వల్ల కాన్పు చాలా తేలికగా అయింది. ఆ కసరత్తులు ఇప్పటికీ కొనసాగిస్తున్నా. గతంలో కన్నా ఇప్పుడు చాలా తేలికగా ఉన్నట్టు అనిపిస్తున్నది. కాన్పు తర్వాత తల్లులు అందరూ ప్రత్యేక ఆసనాలు, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఒకరకంగా మనతరం అంతా సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటుపడ్డాం. నా వరకైతే వాటికి దూరంగా ఉంటాను. రోజులో ఇంత సమయం సెల్‌ఫోన్ పక్కనపెట్టాలని నిర్ణయించుకోవాలి. ఇక సామాజిక మాధ్యమాలు అభిమానులను నేరుగా కలిసేందుకు వారధులు. వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ట్రోల్స్ అంటారా, వాటిని సాధ్యమైనంత ఇగ్నోర్ చేస్తే మేలు.
హిందీలో నేను నటించిన ‘ఉమ’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలోనూ ‘గోస్టీ’ సినిమా రానున్న రోజుల్లో రిలీజ్కాబోతున్నది. కొన్ని కొత్త చిత్రాల షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ సంతృప్తికరంగానే ఉంది.