Ugadi 2022 | ఉత్తర ప్రాంతంలో అగ్నిభయం, దక్షిణాదిన సుభిక్షం ఉంటాయి. చైత్ర, వైశాఖ మాసాల్లో వస్తువుల ధరలు నిలిచి ఉంటాయి. జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో స్వల్ప వర్షం, వస్తువుల ధరలు నిలిచి ఉంటాయి. శ్రావణం, భాద్రపదంలో అధిక వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. నెయ్యి, నూనె ధరలు నిలిచి ఉంటాయి. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో ధాన్యాదుల ధరలు తగ్గవచ్చు. మార్గశిరం, పుష్య మాసాల్లో అపర ధాన్యాల ధరలు అందుబాటులో ఉంటాయి, పాలకుల మధ్య కలహాలకు అవకాశం. మాఘ, ఫాల్గుణాల్లో మిశ్రమంగా ఉంటుంది. ప్రజలకు అనారోగ్యం, భయం ఉంటాయి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం చైత్ర శుక్ల ద్వాదశి బుధవారం 13-04-2022 పగలు 3-46కు గురువు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తదాది సంవత్సరం అంతా మీనరాశిలోనే ఉంటాడు. మీనం బృహస్పతి స్వక్షేత్రం. ఈ రాశిలో గురువు సంచారం వల్ల నాయకులకు, ప్రజలకు అన్యోన్యత ఏర్పడుతుంది. పాలకులు న్యాయంగా రాజ్యపాలన చేస్తారు. ప్రజలకు కావలసిన విధంగా సంక్షేమ పనులపై మనసు నిలుపుతారు. కొన్ని ప్రాంతాలలో అనుకూల వర్షాలతోపాటు సుభిక్షం నెలకొంటుంది. కొన్నిచోట్ల అతివృష్టి సూచన.
గమనిక : జన్మరాశి నుంచి 1, 3, 4, 6, 8, 10, 12 రాశుల్లో గురు సంచారం ఉన్నవారు జప, హోమ, దానాలు చేయడం మంచిది.
శుభకృత్ నామ సంవత్సర చైత్ర కృష్ణ చతుర్దశి శుక్రవారం తేది 29-04-2022 ఉదయం 7-37కు శని కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వక్రంగతుడై ఇదే సంవత్సరం ఆషాఢ శుక్ల చతుర్దశి మంగళవారం తేది 12-07-2022 నాడు మకరంలోకి ప్రవేశిస్తాడు. తిరిగి పుష్య కృష్ణ దశమి మంగళవారం తేది 17-01-2023 నాడు రుజుమార్గంలో కుంభ రాశిలోకి ప్రవేశించి సంవత్సరాంతం వరకూ అదే రాశిలో సంచరిస్తాడు. మకర రాశిలో శని సంచారం వల్ల భయోత్పాతాలు అధికంగా ఉంటాయి. ధరలు పెరుగుతాయి. వర్షాలు అధికంగా కురుస్తాయి. యవన దేశాల్లో కష్టనష్టాలు సంభవిస్తాయి. పురోహితులకు, బ్రాహ్మణులకు, వైద్యులకు హాని. కుంభరాశిలో శని సంచారం వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. రాజకీయ కలహాలు ఏర్పడతాయి. ప్రజల్లో భయాందోళనలు తలెత్తుతాయి. సస్యహాని, అనారోగ్య సూచన.
ఉగాది మొదలు 29/4/2022 వరకు, 12/7/2022 నుంచి 17/1/2023 వరకు శని మకర రాశిలో సంచరిస్తాడు. ధనుస్సు, మకరం, కుంభ రాశులవారికి ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. మిథున రాశివారికి అష్టమ శని, తుల రాశివారికి అర్ధాష్టమ శని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. 29/4/2022 నుంచి 12/7/2022 వరకు, 17/01/2023 నుంచి సంవత్సరాంతం వరకు శని కుంభరాశిలో సంచరిస్తాడు. ఫలితంగా మకరం, కుంభం, మీన రాశుల వారికి ఏల్నాటి శని ప్రభావం, కర్కాటక రాశివారికి అష్టమ శని, వృశ్చికరాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఆయా రాశులలో జన్మించిన వారు శని ప్రీత్యర్థమై జప, క్షీర తర్పణ, హోమ, దానాలు చేసుకోవడం మంచిది. ప్రతిరోజూ ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శని మూలంగా కలిగే దుష్ప్రభావాలు తొలగుతాయి.
ఈ ఏడాదంతా రాహువు మేష రాశిలో, కేతువు తుల రాశిలో సంచరిస్తారు.
రోహిణి కార్తె: శుభకృత్ నామ సంవత్సరం వైశాఖ కృష్ణ దశమి బుధవారం తేది 25-05-2022 పగలు 2-51 ఉత్తరాభాద్ర 3వ పాదం, మీనరాశి ప్రయుక్త కన్యా లగ్నంలో నిర్జలరాశిలో, మేష వాహనంపై రోహిణి కార్తె ప్రవేశం.
ఫలం: పురుష-పురుష యోగం- సామాన్య వృష్టి, కన్యా లగ్నం- అనావృష్టి, వాయునాడి- గాలితో కూడిన వర్షాలు.
మృగశిర కార్తె: శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ కృష్ణ అష్టమి బుధవారం తేది 8-6-2022 పగలు 12-37 ఉత్తరఫల్గుణి 2వ పాదం, కన్యారాశి ప్రయుక్త సింహలగ్నంలో నిర్జలరాశిలో, ఖర వాహనంపై మృగశిర కార్తె ప్రవేశం.
ఫలం: నపుంసక-పురుష యోగం- స్వల్పవృష్టి, సింహలగ్నం-అనావృష్టి, దహననాడి- అనావృష్టి
ఆరుద్ర కార్తె: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం జ్యేష్ఠ కృష్ణ నవమి బుధవారం 22-06-2022 పగలు 11-42 రేవతి 2 పాదం, మీన రాశి ప్రయుక్త సింహ లగ్నంలో నిర్జల రాశిలో, జంబుక వాహనంపై ఆరుద్ర కార్తె ప్రవేశం.
ఫలం: స్త్రీ-స్త్రీ యోగం- స్వల్పవృష్టి, సింహలగ్నం-అనావృష్టి, సౌమ్యనాడి-మధ్యమవృష్టి