బాలీవుడ్ స్టార్ కల్కీ కోచ్లిన్.. అపురూప అతిథి హోదాలో హైదరాబాద్ విచ్చేశారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చర్చావేదిక సాక్షిగా.. తన మనసులోని భావాలు పంచుకున్నారు. ‘పితృస్వామ్యం- మాతృత్వం-లైంగికత’ ఇతివృత్తంగా ఏకపాత్రాభినయం చేసి.. అందర్నీ మెప్పించారు. ఆ తర్వాత, మహిళల జీవితానికి సంబంధించి అనేక విషయాలు చర్చించారు. ‘బిడ్డ పెంపకంలో తల్లి పాత్ర ఎంతో, తండ్రి బాధ్యతా అంతే. కనిపెంచడం.. అనగానే అమ్మ వైపే చూడాల్సిన పన్లేదు.
మనం కెరీర్ మీద శ్రద్ధ పెట్టినప్పుడు.. సూపర్ ఉమెన్ అనిపించుకుంటాం. అదే, సమయంలో పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ తగ్గితే బ్యాడ్ మదర్‌గా మిగిలిపోతాం. దేశాన్ని ఏలినా సరే.. అమ్మ మాత్రం అమ్మ బాధ్యత నిర్వర్తించాల్సిందే. సమాజానికి మహిళ మీద చాలా అంచనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఫెమినిజం అనేమాట బాగా దుర్వినియోగం అవుతున్నది. మహిళ వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను గౌరవించడమే నా దృష్టిలో ఫెమినిజం. మహిళ నోరు కట్టేసుకుని బతకడం మానేయాలి. తన భావాలను వ్యక్తం చేయాలి. ఆమోదించేవారు ఆమోదిస్తారు. లేనివారు లేదు. తను మాత్రం మాట్లాడటం ఆపేయకూడదు. ఇదే నేను ఎంచుకున్న పద్ధతి’ అన్నారామె.